సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. సరే అయిందేదో అయిపోయింది అనుకోవచ్చు. కానీ పుండు మీద కారం చల్లినట్లు కొత్త కెప్టెన్ మార్క్రమ్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడవే ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేస్తున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. రాజస్థాన్ చేతిలో 72 పరుగుల తేడాతో, లక్నోపై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలి మ్యాచులో అంటే కెప్టెన్ మార్క్రమ్ తో పలువురు స్టార్ ప్లేయర్లు లేరు, అందుకే ఇలా జరిగిందనుకోవచ్చు. మరి రెండో మ్యాచులో ఏమైనా తీరు మార్చుకుందా? అంటే అస్సలు అల జరగలేదు. రిజల్ట్ కూడా ఏం మారలేదు. సేమ్ అంతే ఘోరంగా మ్యాచ్ ని సమర్పించేసుకుంది. మ్యాచ్ ఓడిపోవడం కాదు.. పూర్తయిన తర్వాత కెప్టెన్ మార్క్రమ్ కొన్ని కామెంట్స్ చేశాడు చూడండి. అవి అయితే సన్ రైజర్స్ పరువు తీసేయడంతో పాటు మార్క్రమ్ పై ఫ్యాన్స్ ట్రోల్ చేసేంత వరకు వెళ్లిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. లక్నోతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఓవర్లన్నీ ఆడి 121/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. పోనీ ఛేదనలో ఏమైనా సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతం చేశారా అంటే అదీ లేదు. దీంతో లక్నో జట్టు ఆడుతూ పాడుతూ టార్గెట్ పూర్తి చేసింది. లక్నో మ్యాచ్ తో ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ మార్క్రమ్.. ఫస్ట్ ఫస్ట్ డకౌట్ అయి పరువు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఇచ్చిన ఎలివేషన్స్ కు.. మ్యాచ్ లో అతడి ఆటకు అస్సలు సంబంధమే లేకుండా పోయింది. సరే అయిపోయిందేదో అయిపోయింది నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకోవచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వాళ్లకు మండిపోయేలా కొత్త కెప్టెన్ కామెంట్స్ చేశాడు.
‘మేం బ్యాటింగ్ లో దారుణంగా ఫెయిలయ్యాం. 150-160 పరుగులు చేసుండాల్సింది. లక్నో పిచ్ బ్యాటింగ్ కు పెద్దగా సహకరించలేదు. మేం ఈ మ్యాచులో చివరివరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది’ అని సన్ రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్ అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏ పిచ్ పై అయితే సన్ రైజర్స్ రన్స్ కొట్టడానికి ఇబ్బందిపడిందో అదే పిచ్ పై లక్నో బాగానే బ్యాటింగ్ చేసింది. దానికి తోడు మార్క్రమ్.. చివరివరకు పోరాడం అని చెప్పడం ఫ్యాన్స్ ని మరింత పిచ్చెక్కిపోయేలా చేసింది. కెప్టెన్ గా ఈ మాటలు చెప్పడానికి సిగ్గులేదా అని ముఖం మీదే కడిగేస్తున్నారు. సోషల్ మీడియా అంతా సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ ని ట్రోల్ చేయడంతో నిండిపోయింది. మరి మార్క్రమ్ వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.