లైంగిక విద్య.. ఈ పదం వినగానే చాలా మంది ఆపేయ్ అంటారు. ఇప్పటికే విద్యా విధానం, సమాజంలో ఈ సబ్జెక్ట్ ని బూతుగానే చూస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ వంటివి ఎలా అయితే విద్యలో భాగం అయ్యాయో అలాగే సె*క్స్ ఎడ్యుకేషన్ కూడా బోధనాంశం కావాలని చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. శరీరం, సంతానోత్పత్తి, సామర్థ్యం, సమస్యలు ఇలా ముఖ్యమైన అంశాలను అయినా ఎడ్యుకేషన్ లో చేర్చాలంటూ డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. అయితే చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఇలాంటి అంశాలను ప్రస్తావించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇంక మన కుటుంబ వ్యవస్థలో దీని గురించి ప్రస్తావించే అవకాశమే ఉండదు. మీకు ఏ సందేహం వచ్చినా? మీకు ఏదైనా సమస్య వచ్చినా ఎవరితో చర్చించలేరు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో చర్చించాలన్నా కూడా భయం, సిగ్గుగా భావిస్తుంటారు. ఎందుకంటే లైంగిక విద్య అనేది మన దగ్గర ఓ బ్రహ్మ పదార్థంగా, అసలు చర్చించేందుకు నిషేధించబడిన అంశంగా చూపించడమే. ఎంతో మంది పెళ్లి తర్వాత కూడా తమ సమస్యలకు పరిష్కారం దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం వైద్యురాలు తనయా నరేంద్ర డాక్టర్ క్యుటెరస్ అనే పుస్తకం రచించింది. ఆ పుస్తకం వల్ల ఇప్పుడు ఆమె దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
డాక్టర్ క్యుటెరస్.. నీ శరీరం గురించి నీకు ఎవరూ చెప్పరు అంటూ ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ పుస్తకంలో తనయా ఎన్నో అంశాలను టచ్ చేసింది. దాదాపు మీ శరీరం గురించి మీరు ఏం తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఆ పుస్తకంలో మీకు సమాధానం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. ఈ పుస్తకం డిసెంబర్ 5, 2022న పబ్లిష్ పెంగ్విన్ పబ్లికేషన్ గా మార్కెట్‌లోకి వచ్చింది. బయట ఎవరైతే చర్చించేందుకు ఇబ్బంది పడతారో అలాంటి లైంగిక వ్యాధులు, కుటుంబ నియంత్రణ, అబార్షన్లు, ప్రవేట్ పార్ట్స్ ఇలా ఎన్నో అంశాలను చాలా లోతుగా వివరించారు. మీ శరీరానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు తమ పుస్తకంలో సమాధానం దొరుకుతుందని తనయా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పుస్తకం విడుదలైన తర్వాత తనయా పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే తనయా అంతకు ముందు నుంచే బాగా పాపులర్. వైద్య విద్యకు సంబంధించి అవగాహన కల్పించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్స్‌లో భారతదేశంలోనే తనయా నరేంద్ర బాగా పాపులర్. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 10 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలకు 50 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఆమె అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన వైద్యురాలు, సైంటస్ట్ కూడా. ఆమె ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ పూర్తి చేసుకుంది.
తర్వాత ఆమె ఇంగ్లాండ్‌లో వైద్యురాలిగా నమోదు చేసుకుంది. తనయా ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రముఖ రాయల్ సొసైటీ మెంబర్ కూడా. ఆమెకు మొదటి నుంచి వైద్య విద్యపై అవగాహన కల్పించడం అంటే చాలా ఇష్టం. ఆమె 2020వ సంవత్సరంలో సె*క్సువల్ హెల్త్ ఇన్ ఫ్లుఎన్సర్ గా అవార్డును కూడా అందుకుంది. ఇంగ్లాండ్ హెల్త్ సర్వీస్‌కు సంబంధించిన ఎన్‌హెచ్‌ఎస్‌లో ఆమె మెంబర్ కూడా. ఆమె కేవలం రెండేళ్లలోనే ఓ కమ్యూనిటీని తయారు చేసింది. అక్కడ మీరు ఏ టాపిక్ గురించి అయినా ప్రస్తావించవచ్చు, చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు.