సామాన్యంగా కొబ్బరి నీళ్లు(coconut water) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అయితే మన బాడీ లోపలి లోపాలకోసమే కాదు.. బాహ్య సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా కొబ్బరి నీటిని ఉపయోగిస్తారు. అలాగే చర్మంతో పాటు జుట్టు సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అయితే.. ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా డ్రై హెయిర్, చుండ్రు సమస్యలతో బాధ పడుతున్నారు. అలాంటివారు కొబ్బరి నీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం!1) ఫ్రెష్ కొబ్బరి నీటిని నేరుగా ఉపయోగించడం:
ఫ్రెష్ కొబ్బరి నీళ్లను నేరుగా జుట్టు మరియు తలపై మసాజ్ చేస్తే రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. అలా చేయడం వలన జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమేగాక జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. 1/2 కప్పు తాజా కొబ్బరి నీళ్లను తీసుకుని నేరుగా తలపై 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో పాటు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
2) కొబ్బరినీరు – నిమ్మరసం:
నిమ్మరసం స్కాల్ప్‌ను బాగా ఉంచుతుంది. అలాగే చుండ్రు, మొటిమలను దూరం చేసేందుకు కూడా సహాయపడుతుంది. 2 కప్పుల కొబ్బరి నీళ్లలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. కాసేపటికి ఈ మిశ్రమాన్ని తలపై జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరిగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.
3) కొబ్బరినీరు – తేనె:
జుట్టులో దురద నుండి ఉపశమనం పొందాలంటే తేనె బాగా పనిచేస్తుంది. 1 కప్పు కొబ్బరి నీటిలో 4 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి, వెచ్చని టవల్ తో జుట్టును కవర్ చేయాలి. 30 నిమిషాల తర్వాత మీ జుట్టును శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.