శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ మాసంలో వచ్చే ప్రతీ రోజుకి, ప్రతీ వారానికి ప్రత్యేకత ఉంది. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది. ఎక్కువ పండుగలు వచ్చే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం ఏడాదిలో ఐదో నెల శ్రావణం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత ఫలితాన్ని అందిస్తాయి. ఈ మాసం అంటే మహాశివుడికి కూడా అత్యంత ఇష్టమని భక్తుల నమ్మకం.
శ్రావణ మాసం లో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య,నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసం. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు.
ముఖ్యంగా ఈ ఉత్తర భారతదేశంలో శ్రావణమాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఉపవాసాలు, మాంసభక్షణకు దూరంగా ఉండటం, అభిషేకాలు ఆచరించండం, శివక్షేత్రాలు దర్శించడం చేస్తారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఈ వత్రం ఆచరించడం వల్ల పెండ్లికూతురు ఆ ఊరిలో అందరితో ప్రేమతో కలవడం, ఆప్యాయతలను పొందడం, కొత్తదనం పోవడం వంటి అనేక లాభాలు ఈ వ్రతం వల్ల కలుగుతాయి.