Kurnool: ప్రేమించిన అమ్మాయి ప్రాణాలతో లేదన్న విషయం తెలుసుకున్న ఓ యువకుడు తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. చివరగా తన తండ్రికి ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్‌లో తన బాధను చెప్పుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా బి.అగ్రహారం గ్రామానికి చెందిన మంగలి శివప్రసాద్ కోడుమూరు పట్టణంలోని ఓ కాలేజ్‌లో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
అదే కాలేజ్‌లో చదువుతున్న ఓ అమ్మాయి, శివప్రసాద్ ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించారు. గతేడాది ఇద్దరూ ఇంటినుంచి పారిపోయారు. ఇరు కుటుంబాల వాళ్లు వారిని వెతికి పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు. మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించారు. ఇక, అప్పటినుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
కానీ, ఇద్దరి మనసులు దూరం కాలేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఈ విషయం శివప్రసాద్‌కు తెలిసింది. ప్రియురాలు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. ‘‘నాన్నా.. నాకు బతకాలని లేదు. మీకు తెలుసు నేను ఓ యువతిని ప్రేమించిన విషయం. ఆమె ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాను.
కానీ ఆమె ఇప్పుడు లేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలియదు. నా ప్రేయసి ఎక్కడ ఉన్నా బాగుంటుందని ఇన్నాళ్లూ బతికాను. ఆమె బలవన్మరణం చెందిన విషయం తెలిసింది. ఇక నేను బతకను. సారీ నాన్నా’’ అంటూ సూసైడ్ నోట్ రాసి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bihar: మరుగుజ్జు దంపతుల సాహసం.. హ్యాట్సాప్ అంటున్న పోలీసులు