ప్రేమ పేరుతో సినిమాలు, షికార్లు కామన్. అలాగే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మన విషయం ఇంట్లో మాట్లాడదాం అని యువత అడిగే సరికి.. తాను జీవితంలో స్థిరపడలేదనో లేక కుల, మతాలు కలవడం లేదనో, నిన్ను చేసుకుంటే మా తల్లిదండ్రులు చనిపోతున్నారంటూ బెదిరిస్తున్నారోనని వంక చెప్పి ప్రేమకు అక్కడితోనే బ్రేకప్ చెప్పేస్తారు.
ప్రేమ అంటూ యువతి వెంట పడతారు. ప్రేమించే వరకు ప్రాణం తీస్తారు. అమ్మాయి అంగీకరించాక ప్రేమ పేరుతో సినిమాలు, షికార్లు కామన్. అలాగే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మన విషయం ఇంట్లో మాట్లాడదాం అని యువత అడిగే సరికి.. తాను జీవితంలో స్థిరపడలేదనో లేక కుల, మతాలు కలవడం లేదనో, నిన్ను చేసుకుంటే మా తల్లిదండ్రులు చనిపోతున్నారంటూ బెదిరిస్తున్నారోనని వంక చెప్పి ప్రేమకు అక్కడితోనే బ్రేకప్ చెప్పేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రబుద్దుడు కాస్త డిఫరెంట్. అమ్మాయిని వెంట పడి ప్రేమించాక.. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ నెల 10న పెళ్లి నిశ్చయించాక.. ఇప్పుడు ఆమెకు మొహం చాటేశాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఆ యువతి ఆత్మహత్యకు ఒడిగట్టింది.
ఈ హృదయ విదారక ఘటన కర్నూలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ నరసింహారావుకాలనీకి చెందిన మల్లెపోగు మధు, షేకమ్మ దంపతుల కుమార్తె పద్మావతి(30) డిగ్రీ పూర్తయ్యాక ఓ వాహన షోరూంలో పదేళ్లుగా పనిచేస్తోంది. అయిదేళ్ల క్రితం ఆమె పనిచేసే షోరూములో నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోటకు చెందిన వినోద్‌కుమార్ అలియాస్ ప్రవీణ్‌కుమార్ పనికి కుదిరాడు. ఆ సమయంలో ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. తొలుత పద్మావతి అంగీకరించలేదు. ఇంతలో వినోద్ మరో కంపెనీలోకి మారాడు. అయినా ఆమెకు తరచూ ఫోన్లు చేసి ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడు. అతడి ప్రేమ సిన్సీయర్ అనుకున్న ఆమె.. వినోద్‌ని ప్రేమించడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి..పెళ్లికి ఒప్పించుకుంది.
పెద్దల సమక్షంలో మార్చి 9న వీరికి నిశ్చితార్థం అయ్యింది. వరకట్నం కింద రూ. లక్ష నగదు, బంగారపు వస్తువులు పెడతామని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈ నెల 10న పెళ్లి ముహుర్తంగా పెద్దలు నిశ్చయించారు. అంతే సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఆమెకు గుండె పగిలే వార్త చెప్పాడు. తనకు ఈ నెల 29న వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి.. మా అమ్మాయిని వినోద్ మోసం చేశాడంటూ పద్మావతి తల్లిదండ్రులు దిశ మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పద్మావతి తనకంటే వయస్సులో నాలుగేళ్లు పెద్దదని, బలవంతంగా తనతో నిశ్చితార్థం చేశారంటూ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం విచారణ జరగాల్సి ఉండగా.. పద్మావతి విషం తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి చనిపోయింది.
కాగా, ఆమె చనిపోయే సమయంలో సూసైడ్ నోట్ రాసింది. పోలీసులకు అది లభ్యమైంది. అందులో ‘అమ్మా నాన్నా! నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా గురించి బాధ పడకండి. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి. నా చావుకు కారణం వినోద్. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నా వెంట తిరిగాడు. నిశ్చితార్థం చేసుకుని లగ్నపత్రిక రాయించి, పెళ్లిపత్రికలు అచ్చు వేయించాక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను నన్ను మోసగించాడు. వినోద్, అతని తలిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, చిన్నాన్న మధుబాబు, ఐదుగురు మేనత్తలు నా చావుకు కారణం’ అని పేర్కొంది. ఈ లేఖ మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.