ప్రకాశం క్రైం- సమాజంలో మహిళలపై దాడులు పెరిగాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి ఇవన్నీ ఎవరో ఒకరి ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వివాహితపై ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. శారీరకంగా తనకు లొంగలేదని ఓ వివాహితపై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోచర్ల గ్రామానికి చెందిన 37 ఏళ్ల కలగాని సుమతి భర్తతో విభేదాలు రావడంతో కొంత కాలంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. గత సంవత్సరం సుమతి తన కుమార్తెకు పెళ్లి కూడా చేసింది. ఈ క్రమంలో కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన జాజుల రాజా అనే యువకుడు సుమతిపై కన్నేశాడు.
చాలా రోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సుమతి రాజాను తన జోలికి రావద్దని గట్టిగా మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న రాజా ఇంట్లో ఒంటరిగా ఉన్న సుమతి వద్దకు వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ఎదురు తిరగడంతో తాను వెంట తెచ్చిన పెట్రోల్ ను ఆమెపై పోసి తగలబెట్టి పారిపోయాడు. సుమతి గట్టిగా అరుచుకుంటూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది.
వెంటనే చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పివేసి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి తీవ్ర గాయాలైన సుమతిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాగా కాలిన గాయాల కారణంగా సుమతి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు తీసుకెళ్లారు. రాజాకు కూడా స్వల్ప గాయాలు కావడంతో బంధువులు ఒంగోలు తీసుకెళ్లారు. సుమతి ఫిర్యాదు మేరకు రాజాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.