ఇటీవల ఎంతో ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకల్లో అకస్మాత్తుగా విషాదాలు నిండుకుంటున్నాయి. కొద్దిసేపట్లో పెళ్లి అనగా.. వరుడు, వధువు ఎవరో ఒకరు చనిపోవడం.. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాలం చేయడం జరుగుతుంది.. ఇక బారాత్ వేడుకల్లో అపశృతులు జరుగుతున్నాయి.
ఈ మద్య కాలంలో వివాహవేడుకల్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా కన్నుమూయడం.. పెళ్లి కొద్ది సేపట్లో ఉండగా వధూ, వరుడు ఎవరో ఒకరు హఠాత్తుగా చనిపోవడం.. పెళ్లి బారాత్ లో డ్యాన్స్ చేస్తూ బంధువు, స్నేహితుడు చనిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తన స్నేహితుడి పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న యువకుడు హఠాత్తుగా కుప్ప కూలిపోయాడు.. క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. దాంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా జరిగింది. వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లా పార్డీ గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడి వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. శనివారం పెళ్లి రిసెప్షన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. బంధు మిత్రులు, స్నేహితులు అందరితో వాతావరణం కోలాహలంగా ఉంది. ఈ సందర్భంగా పెళ్లి కొడుకు.. మహరాష్ట్రకు చెందిన ముత్యం అనే యువకుడు రాత్రి ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో డ్యాన్స్ చేశాడు. అంతా కేరింతలు కొడుతుండగా డ్యాన్స్ చేస్తున్న ముత్యం అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.. వెంటనే కుటుంబ సభ్యులు బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముత్యం కన్నుమూశాడని వైద్యులు తెలిపారు.
అప్పటి వరకు పెళ్లి వేడుకలో అందరూ ఎంతో ఆనందంగా ఉండగా.. పెళ్లికొడుకు స్నేహితుడు ముత్యం మరణం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక పెళ్లి కోసం వచ్చి బంధువులు, స్నేహితులు సైతం దుఃఖంలో మునిగిపోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. రాజస్థాన్ లోని పాలీ జిల్లాలో వ్యక్తి తన వొదిన పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కన్నుమూశాడు. ఉత్తర్‌ప్రదేశ్ లోని మణిశర్మ అనే వ్యక్తి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూశాడు.