ఈ మద్య ఈజీ మనీ కోసం కొంత మంది చేయకూడని పనులు చేస్తూ పోలీసుకు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ ఇంజనీర్ ఈజీ మనీ కోసం చైల్డ్ పోర్న్ వీడియోలను కొనుగోలు చేసి వాటిని అమ్మకానికి పెట్టి సమాజం తల దించుకునే వ్యాపారం మొదలు పెట్టాడు. గత రెండేళ్లుగా కోరోనా ప్రభావంతో చిన్నా పెద్ద అందరూ సెల్ ఫోన్లకే పరిమితం అయ్యారు. ఈ మద్య వస్తువులు కొనాలన్న అమ్మాలన్నా ప్రతి ఒక్కరూ ఆన్లైన్‌ను వినియోగిస్తున్నారు. అదే సమయంలో కొంత మంది నెట్ ని దుర్వినియోగం చేస్తూ జీవితాలను సర్వ నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ లో అశ్లీల చిత్రాలకు బానిసలై సమాజం ఛీ కొట్టే పనులకు తెగబడుతున్నారు.
ఓ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగాలను వదులుకొని ఆన్ లైన్ లో చైల్డ్ పోర్న్ వీడియోలను అమ్మకానికి పెట్టి పోలీసులకు పట్టుబడిన వైనం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ ఫకీరు గూడెనికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల సోహైల్ ప్రముఖ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలలో పని చేసినా ఆశించిన జీతం రాకపోవడంతో ఉద్యోగం మానివేశాడు. ఇదే క్రమంలో ఇంట్లో ఉంటూ ఆన్ లైన్ లో అశ్లీల చిత్రాలు చూస్తూ వాటికి బానిస అయ్యాడు. ఒక రోజు చైల్డ్ పోర్న్ వీడియోస్ అమ్మబడును అనే ప్రకటన చూసిన సొహైల్ కొంత డబ్బును ఆన్లైన్ లో చెల్లించాడు. కొద్ది సేపటికే సోహైల్ కు ఒక లింక్ వచ్చింది. లింక్ ను క్లిక్ చేస్తే అందులో నాలుగు వేల చైల్డ్ పోర్న్ వీడియోలు ఉన్నాయి.
సొహైల్ కి కొత్త ఐడియా వచ్చింది. తాను కొన్నట్టుగానే ఆ వీడియోలు ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్మబడును అనే యాడ్ ను ఆన్లైన్ లో పెట్టాడు. ఇది గమనించిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 62బి ఐ టి యాక్ట్, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సోహైల్‌ను అరెస్ట్ చేసి కోర్ట్‌లో హాజరు పరిచారు. కోర్ట్ సోహైల్‌కు రిమాండ్ విధించింది. సోహైల్ చైల్డ్ పోర్న్ వీడియోలు ఎవరి వద్ద కొనుగోలు చేశాడు, ఎవరెవరికి అమ్మాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక చైల్డ్ పోర్న్ సైట్ లను బ్యాన్ చేస్తూ.. కోర్టు సీరియస్ గా ఆర్డర్ చేసినా.. కొంత మంది పోర్న్ సైట్లు చూస్తున్నారని.. అది తీవ్ర నేరంగా పరిగనిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.