ప్రేమ, పెళ్లి వంటి బంధాలను చాలామంది వక్రమార్గాల్లో, కోరికలు తీర్చుకోవడానికే వాడుకుంటున్నారు. చాలా మంది ప్రేమ పేరుతో యువతులను, మహిళలను మోసం చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు మోసపోయామంటూ బాధపడుతూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం ధైర్యం చేసి అలాంటి వారికి శిక్ష పడాలని బయటకు వచ్చి పోరాడుతూ ఉంటారు. అలా ఓ మహిళ తనకు అన్యాయం చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ కలెక్టర్ ను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో తనని మోసం చేసి.. వేరే మహిళను వివాహమాడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
మహిళ ఫిర్యాదు ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో లక్ష్మి అనే మహిళ నివాసముంటోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెతో సీడబ్ల్యూసీలో పనిచేసే సాధిక్ పాషా పరిచయం పెంచుకున్నాడు. అతనికి పెళ్లి కాలేదని ఆమెకు నమ్మబలికాడు. ఇప్పటికే ఆలస్యం కావడం వల్ల ఎవరూ పిల్లని ఇవ్వడం లేదని ఆ మహిళని నమ్మించాడు. అతడిని పెళ్లి చేసుకుంటే బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన మహిళ సన్నిహితంగా మెలగింది. వారు ఐదేళ్లపాటు సహజీవనం కూడా చేశారట. అయితే పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరితే మాత్రం మాట దాటేయడం చేసేవాడట.
గట్టిగా అడగ్గా.. సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎన్నికయ్యాక చేసుకుంటాని మాటిచ్చినట్లు తెలిపింది. గత ఐదేళ్లుగా అదే మాట చెప్తూ వస్తున్నాడట. కానీ, గత కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. ఆరా తీయగా ఆమెకు అసలు విషయం తెలిసింది. ఇదివరకే పెళ్లే పిల్లలు కూడా ఉన్న మరో మహిళతో సాధిక్ కు వివాహం జరిగిందట. అదే విషయంలో సాధిక్ ని ప్రశ్నించగా.. దిక్కున్నచోట చెప్పుకోవాలంటూ అవమానించాడంటూ మహిళ ఆరోపించింది. తర్వాత తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ ను ఆశ్రయించింది. సాధిక్ పాషాపై కఠిన చర్యాలు తీసుకోవాలంటూ కలెక్టర్ ను కోరింది.