వినడానికి విడ్డూరమే అయినా., తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది. భర్తను చంపడానికి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టేసింది ఓ భార్య. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండిలో నివాసముంటున్న నిందితురాలు శృతి గంజి, తన భర్తను చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుంది. ఇందుకోసం తన స్నేహితుడి సహాయం తీసుకుంది. మహిళ తన భర్తను చంపడానికి సుపారీగా ఇవ్వడానికి లక్ష రూపాయలు అవసరమై ఆమె మంగళసూత్రం తనఖా పెట్టిందని పోలీసులు చెప్పారు. నిందితురాలు తన ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ను క్యాన్సిల్ చేయడం ద్వారా మరో రూ. 3 లక్షలు సమీకరించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
శృతి, తన ప్రియుడుతో కలిసి జీవించడానికి తన భర్త ప్రభాకర్ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. ప్రభాకర్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నప్పటికీ శ్రుతికి విడాకులు ఇచ్చేందుకు నిరాకరించాడు. శృతి తన వైవాహిక జీవితంలో విసిగిపోయినందున, ఆమె తన స్నేహితురాలు ప్రియా నికమ్‌తో చర్చించింది. స్నేహితురాలి సలహాతో కాంట్రాక్ట్ కిల్లర్ సంతోష్ రెడ్డిని సంప్రదించింది. తన మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి రూ.1లక్ష వరకూ పోగు చేసింది. వాటిని సుపారీగా ఇచ్చి భర్తను చంపేయాలని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ డబ్బులు అవసరమవడంతో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్న డబ్బును విడిపించుకుని రూ.3లక్షలు విడుదల చేసుకుంది.
భర్త హత్యకు పాల్పడిన శృతి, ఆమె ప్రియుడుని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య గురించి జరిపిన విచారణలో సాక్ష్యాలు లేనప్పటికీ శ్రుతి ఇచ్చిన సమాధానాలను బట్టి ఘటన పూర్తి వివరాలు తెలిశాయని పోలీసులు చెప్పారు. తానే భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చానంటూ శృతి చెప్పేసింది.