ప్రేమ పేరుతో దగ్గరవ్వడం.. నువ్వే నా ప్రపంచమంటూ మాయమాటలు చెప్పడం.. సినిమాలకు, షికార్లకు తిప్పడం.. మోసం చేయడం ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరిగేవే. కాకుంటే.. ఈ కథలో యువకుడు ఒకడుగు ముందకేసి పెళ్లిచేసుకున్నాక మోసం చేయాలని చూశాడు. ప్రేమపేరుతో దగ్గరైన యువకుడు, ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకొని.. ఐదు నెలలు కాపురం చేసి.. అనంతరం ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం చీపురుగూడెంకు చెందిన వసంతాడ అనిల్‌కుమార్, అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన తమ్మిలేటి నాగరాణి ఇద్దరూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలసి చదువుకున్నారు. ఆ సమయంలో ఏర్పడ్డ పరిచయం.. ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లు ఘాడంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో చదువు పూర్తవ్వడంతో.. పెళ్ళిచేసుకోవాలని భావించి.. గతేడాది డిసెంబర్ 17న సికింద్రాబాద్ ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మియాపూర్‌లో కాపురం పెట్టారు. ఐదు నెలల పాటు అంతా సజావుగానే సాగింది. ఈలోపు అతడికి చెన్నైలో ఉద్యోగం వచ్చింది. దీంతో అతను చైన్నైకు మకాం మార్చాడు. ఇక్కడినుంచే అతని ప్రవర్తనలో మార్పుచ్చింది.
‘నన్ను ఎప్పుడు తీసుకెళ్తావ్..’ అని యువతి ప్రశ్నిస్తే.. అప్పుడు.. ఇప్పుడు అంటూ ఆరుమాసాలుగా మొహం చాటేస్తున్నాడు. ఈ విషయమై నాగరాణి అప్పట్లో హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పోలీసులు ప్రశ్నించగా త్వరలో వచ్చి నాగరాణిని తీసుకెళతానని లిఖిత పూర్వక హామీ ఇచ్చాడు. అయినా తీసుకెళ్లలేదు. దీంతో నాగరాణి గత నెల 10న అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేసింది. మరికొంత కాలం గడువు కావాలని కోరడంతో పోలీసులు యువతికి నచ్చజెప్పారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గురువారం నాగరాణి, చీపురుగూడెంలోని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ విషయమై గ్రామపెద్దలు ఇరువర్గాలతో మాట్లాడారు. యువకుడిని స్వగ్రామానికి రప్పిస్తామని హామీఇచ్చారు. ఈ నెల 19 వరకు గడువు ఇవ్వాలని యువకుడి తండ్రి కోరడంతో నాగరాణి అందుకు అంగీకరించారు. ఈ ప్రేమ పెళ్లిపై.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.