మెడికో ప్రీతి ఆత్మహత్య సంచలనంగా మారింది. ఈ కేసులో రోజుకోక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రీతి సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
వరంగల్ కేఎంసీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోన్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. మృతి చెందింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. కాలేజీ యాజమాన్యం, పోలీసులు నిర్లక్ష్య ధోరణి కారణంగానే ప్రీతి మృతి చెందింది అనే ఆరోపణలు వచ్చాయి. సైఫ్.. కులం పేరుతో ప్రీతిని దూషిండచమే కాక.. సీనియర్లు కొందరు కావాలనే ప్రీతిని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేశారు. అవి భరించలేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. కానీ ప్రీతి తల్లిదండ్రులు మాత్రం.. తమ కుమార్తెది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే అని.. ఆరోపించసాగారు. ఈ క్రమంలో ప్రీతి సోదరుడు పృధ్వి.. కేఎంసీ కాలేజీ అధికారులు, నిమ్స్‌లో జరిగిని వైద్య చికిత్సలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
ఈ వీడియోలో పృధ్వి సంచలన ఆరోపణలు చేశాడు. తన సోదరి ప్రీతిది ఆత్మహత్య కాదని.. హత్యే అని..ఇందుకు తన దగ్గర తగిన ఆధారాలున్నాయి అని తెలిపాడు. సైఫ్ వేధింపుల గురించి తన సోదరి హెచ్‌ఓడీకి ఫిర్యాదు చేయడంతో.. వారు సైఫ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామనడం పచ్చి అబద్దం అన్నాడు. ఈ విషయంలో హెచ్‌ఓడీ.. తన సోదరినే బాగా తిట్టాడని.. కనీసం తనను ఎలాంటి వివరణ అడగలేదని పృధ్వి ఆరోపించాడు. పైగా హెచ్‌ఓడీ నాగార్జున రెడ్డి.. సైప్‌కు మద్దతుగా ఉండేవాడని.. అతడితో కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని పృధ్వి ఈ సందర్భంగా ప్రశ్నించాడు.
అంతేకాక ఆత్మహత్యయాత్నం తర్వాత తన సోదరికి నిమ్స్‌లో చికిత్స చేశారని.. ఆ సమయంలో ప్రీతికి పొత్తికడుపు వద్ద ఆపరేషన్ చేశారని.. ఈ సర్జరీ ఎందుకు చేశారో ఇప్పటి వరకు వైద్యులు వెల్లడించలేదని ఆరోపించాడు పృధ్వి. అంతేకాక ప్రీతి చేతిపై గాయం ఉందని.. ప్రీతి శరీరంలో పూర్తిగా రక్తం డయాలసిస్ చేశారని.. ఇలా చేయడం వల్ల ప్రీతి పోస్ట్‌మార్టంలో ఆమె ఏ ఇంజెక్షన్ వాడిందో తెలిసే అవకాశం లేకుండా చేశారంటూ పృధ్వి సంచలన ఆరోపణలు చేశాడు. నిమ్స్‌లో జరిగిన ట్రీట్‌మెంట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి అన్నాడు. నిమ్స్ వైద్యులు తమ సోదరికి చేసిన పూర్తి వైద్య చికిత్స వివరాలను తమకు చెప్పాలని ఈ సందర్భంగా పృధ్వి డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రీతి మృతిపై టీఆర్‌ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, కేటీఆర్‌లు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలపడమే కాక ప్రీతి కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ప్రీతి సోదరుడు చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.