కుమార్తె బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భావించి.. ఉన్న ఇంటిని అమ్మి మరీ ఆమెను విదిశాలకు పంపారు. ఇప్పుడు బిడ్డ చేసిన పనికి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఏం జరిగింది అంటే..
ఆడపిల్ల అంటే వద్దు అనుకునే వారు నేటికి కూడా చాలా మంది ఉన్నారు మన సమాజంలో. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం అలా ఆలోచించలేదు. ఆడపిల్ల అయినా సరే.. ఎంతో ప్రేమగా పంచారు.. బాగా చదవించారు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతానంటే సంతోషంగా సరే అన్నారు. బిడ్డను విదేశాలకు పంపడం వారికి తలకు మించిన భారమైనా సరే.. కుమార్తె మీద ప్రేమతో అంగీకరించారు. బిడ్డ భవిష్యత్తు బాగుంటే చాలనుకుని.. ఆమె చదువు కోసం ఉన్న ఇంటిని అమ్మి మరీ.. విదేశాలకు పంపారు. మరి తల్లిదండ్రులు తన మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే ఆ అమ్మాయి ఏం చేసింది.. వారు జీవితాంత ఏడ్చినా తీరని బాధని బహుమతిగా ఇచ్చింది. ఇంతకు ఏం చేసింది అంటే..
చదువుకోడానికి విదేశాలకు వెళ్లిన యువతి.. ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. లండన్ బ్లూమ్స్ బెర్రీ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న నగరానికి చెందిన బసవరాజ్ శ్రావణి(27) ఈ నెల 10న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. శ్రావణి మృతదేహం గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని బంధువులు తెలిపారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ విజయ, రమేష్ దంపతుల కూతురు శ్రావణి. ఉన్నత విద్య నిమిత్తం లండన్ వెళ్లింది.
శ్రావణి తండ్రి లారీ డ్రైవర్ కాగా.. తల్లి గృహిణి. బిడ్డ ఉన్నత చదువుల కోసం సొంత ఇంటిని అమ్మి మరీ విదేశాలకు పంపారు. అయితే తన కోసం తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావించిన శ్రావణి.. ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని బంధువులు అభిప్రాయపడుతున్నారు. బిడ్డ భవిష్యత్తు కోసం ఇంటిని అమ్మితే.. ఇప్పుడు అదే బిడ్డ ప్రాణాలు తీసుకుని తమ ఆశలనే కాక.. భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చింది అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు శ్రావణి తల్లిండ్రులు.
లండన్‌లోని వరంగల్ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జాయింట్ సెక్రెటరీ ప్రవీణ్ బిట్ల, ఉమెన్ వింగ్ సెక్రెటరీ మేరీఏలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి శ్రావణి మృతదేహాన్ని భారతదేశానికి పంపించినట్లు తెలిపారు. శ్రావణి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసినట్లు తెలిసింది. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.