లైంగిక వేధింపులు తట్టుకోలేక 14 ఏళ్ల మైనర్ బాలిక అపార్ట్ మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాలిక తాత వయసు ఉన్న.. అపార్ట్ మెంట్ లోనే ఉండే వినోద్ జైన్ అనే వ్యక్తి చేష్టల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురయిన బాలిక.. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంది. ఇక వినోద్ జైన్ గత రెండు నెలలుగా తనను ఎలా హింసిస్తున్నాడో వివరిస్తూ.. బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది.
సూసైడ్ నోట్ లో ఏముంది అంటే..
‘‘అమ్మా వేరే ఏ విషయం అయినా.. నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేదాన్ని కాదు. అసులు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో.. నాకు అర్థం కావడం లేదు. దీని గురించి మీకు చెప్పాలనుకున్నా.. కానీ చాలా భయపడ్డాను. ఏం చేయలేక ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను. దీనంతటికి కారణం వినోద్ జైన్. గత రెండు నెలలుగా అతడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను పదే పదే టచ్ చేస్తున్నాడు. బుగ్గలు గిల్లుతూ, ఛాతీ, తొడల మీద చేతులు వేసేవాడు’’ అని లేఖలో రాసుకొచ్చింది.
‘‘నువ్వు అందంగా ఉన్నావంటూ వేధించేవాడు. జీన్స్ వేసుకుంటే చాలా బాగుంటావంటూ పదే పదే వెంటపడేవాడు. ఫ్లాట్‌లోకి రావడానికి ఉన్న మెట్లు, లిఫ్ట్ దగ్గర ఆపి నన్ను వేధించాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. మిమ్మల్ని వదలాలని లేకపోయినా నాకు తప్పడం లేదు. తమ్ముడు, మీరూ అంతా జాగ్రత్త’’ అంటూ ఆ లేఖలో తాను అనుభవించిన మానసిక వ్యధను వెల్లడించింది బాధితురాలు. ఇది చదివిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. ఆడుతూ పాడుతూ సాగాల్సిన వయసులో ఆ చిన్నారి.. ఎంతటి నరకాన్ని అనుభవించిందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ వినోద్ జైన్…
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వినోద్ జైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గుర్తింపు పొందాడు. నగరంలో పలు అపార్ట్‌మెంట్లు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, రాజకీయ అండ కోసం ప్రయత్నించినట్టు భావిస్తున్నారు. ఇక లయన్స్ క్లబ్ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ఆ క్లబ్ విజయవాడ మెగాసిటీ యూనిట్‌కి అధ్యక్షుడిగానూ వ్యవహరించాడు.
విజయవాడ నగర రాజకీయాల్లో వినోద్ జైన్‌కి గుర్తింపు ఉంది. అతడు సుదీర్ఘకాలం పాటు బీజేపీలో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ నాయకుడిగా ఉన్న సమయంలో విజయవాడ పాతబస్తీలో వినోద్ జైన్ కీలక అనుచరుడిగా వ్యవహరించాడు.
2016లో వెల్లంపల్లి బీజేపీని వీడి వైసీపీలో చేరగా 2019 వరకూ బీజేపీలోనే ఉన్న వినోద్ జైన్ మునిసిపల్ ఎన్నికలకు కొంతకాలం ముందు టీడీపీలో చేరాడు. ఎంపీ కేశినేని నాని అనుచరుడిగా ముద్రపడ్డాడు. మునిసిపల్ ఎన్నికల్లో 37వ డివిజన్ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యాడు.
ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెంట వినోద్ జైన్ ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. పోటీగా మంత్రి వెల్లంపల్లి వెంట వినోద్ జైన్ సన్నిహితంగా మెలిగినప్పటి పాత ఫోటోలు టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో పెడుతున్నారు.
పార్టీల తీరుపై జనాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు. 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన వాడిని శిక్షించాలి. కానీ అధికార, విపక్ష పార్టీల తీరు అత్యంత హేయంగా ఉంది. జరిగింది దారుణం, ఆధారాలున్నాయి. నిందితుడికి కఠిన శిక్షలు వేయాలని అంతా కోరుకుంటాం. కానీ మీ పార్టీ అంటే, మీ పార్టీనే అంటూ పోటీపోటీగా చేస్తున్న ప్రచారం చూస్తుంటే బాధేస్తోంది. నిందితుడి పార్టీలతో సంబంధం లేకుండా కేసు విచారణ జరగాలి. కఠినంగా శిక్షించాలి. ఇందులో రాజకీయాలెందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.