ఓ కాలేజీ ప్రిన్సిపాల్ బరితెగించి ప్రవర్తించాడు. అర్థరాత్రి క్లాసుల పేరుతో ఎందరో విద్యార్థినులను లైంగికంగా వేధించాడని స్టూడెంట్స్ వాపోయారు. దీంతో పోలీసులు ఆ ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేశారు.
చదువు చెప్పాల్సిన కొందరు గురువులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. చదువు పేరుతో కామాంధులుగా మారి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అమాయక విద్యార్థులపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ప్రిన్సిపాల్.. అర్థరాత్రి క్లాసుల పేరుతో ఎందరో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పాడు పనులకు తెర లేపాడు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు పోలీసుల చెంతకు చేరాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని కొత్తపేటలో ఉన్న ఓ నర్సింగ్ కాలేజీలో దాదాపు 120 మంది విద్యార్థినులు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం స్టాఫ్ నర్స్ కోర్సులు చదువుతున్నారు. ఇదే కాలేజీకి రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇతగాడు రాను రాను చదువు పేరుతో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అర్థరాత్రి క్లాసుల పేరుతో స్టూడెంట్స్ ను లైంగికంగా వేధించేవాడని స్టూడెంట్స్ వాపోయారు. ప్రిన్సిపాల్ దారుణాలను భరించలేని ఓ విద్యార్థిని ఇటీవల ఫోన్ చేసి తన తల్లిదండ్రులకు వివరించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు వెంటనే హాస్టల్ కు వచ్చి టీసీ ఇవ్వాలని ప్రిన్సిపాల్ ను కోరారు. దీనికి అతను టీసీ ఇవ్వనంటూ వాదించాడు.
ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ బాగోతాన్ని స్టూడెంట్స్ వెలుగులోకి తెచ్చారు. తమను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టడమే కాకుండా, లైంగికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపాల్ తీరును విద్యార్థులను ఎండగట్టారు. అర్థరాత్రి క్లాసుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ తాకడం, లైంగికంగా వేధించడం చేస్తున్నారని వాపోయారు. ఇక ప్రిన్సిపాల్ పాడు పనులపై స్థానిక విద్యార్థి సంఘాలు సైతం స్పందించాయి. స్టూడెంట్స్ తో కలిసి కాలేజ్ ఎదుట ఆందోళన చేపట్టాయి. ఇక ఈ విషయం పోలీసుల దృష్ణికి వెళ్లడంతో వెంటనే కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత విద్యార్థినులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.