విజయవాడ భవానీపురంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆ తల్లి రోధనతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి అని ఆమె అడిగే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ తల్లిని ఓదార్చలేక అలా చూస్తూ ఉండిపోతున్నారు.
‘14 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎంఏ, పీహెచ్ డీ చేసిన నేను.. నా విజ్ఞాన్నాన్ని అంతా ఆ కూతురికి పంచాను. నేను చేసే స్కూల్లో ఉన్న ఆడ పిల్లలకు కౌన్సిలింగ్ చేసేదాన్ని.. కన్నబిడ్డకు చెప్పుకోనా?. చదువు తప్ప మరో ధ్యాసలేని నా బిడ్డపై కామాంధుడి కళ్లు పడటం ఏంటి? బిడ్డ భవిష్యత్ కోసం ఎన్నో పూజలు చేశాను.. కానీ, ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు. నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన ఆ కామాంధుడిని ఉరి తీయండి. అలా అయినా మాకు న్యాయం చేయండి’ అంటూ బాలిక తల్లి డిమాండ్ చేస్తోంది.
ఆదివారం పోలీసులకు బాలిక రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ లభించింది. ఆ నోట్ లో బాలిక తన బాధను.. తల్లిదండ్రులతో చెప్పుకోలేక పోయిన విషయాలను చెప్పుకొంది. ‘వినోద్ జైన్ నా బుగ్గలు గిల్లేవాడు. నువ్వు అందంగా ఉన్నావంటూ టీజ్ చేసేవాడు. నా శరీరంలో ఛాతీ, తొడలు, ఇతర భాగాల్లో చేతులు వేసేవాడు. రెండు నెలలుగా నన్ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అన్నీ మీతో పంచుకునే నేను ఈ విషయాన్ని మాత్రం చెప్పులోక పోతున్నాను. మీకు చెప్పేందుకు నేను సిగ్గుగా భావిస్తున్నాను. అతని చేష్టలతో తీవ్ర భయాందోళనకు గురయ్యాను. ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇదే నా జీవితంలో అతిపెద్ద సమస్య. నేను చనిపోవడానికి కారణం అదే. మీరంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
బాలిక ఆత్మహత్యకు కారణమైన స్థిరాస్తి వ్యాపారి వినోద్ జైన్ గతేడాది టీడీపీ తరఫున 37వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. వినోద్ జైన్ ను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ప్రకటించారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు, లైంగిక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు 306, 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కూతురి వయసున్న బాలికపై ఇంతటి నీఛానికి పాల్పడిన వాడిని ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.