Crime News: పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని ధూమకోట్ ప్రాంతానికి చెందిన ఓ పెళ్లి బృందం బస్సులో వెళుతోంది. కొన్ని గంటల తర్వాత బస్సు బిరోకల్ కొండలోయ ప్రాంతానికి వచ్చింది. కొండ ఎక్కుతుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. వందల అడుగుల ఎత్తుపైనుంచి కింద పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. ఈ నేపథ్యంలో బస్సులో ఉన్న 25 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రాత్రి మొత్తం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బస్సునుంచి బయటకు తీసి అత్యవసర చికిత్సకోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 45 మంది దాకా పెళ్లి వాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దేశ ప్రధాని, రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ ఉత్తరా ఖండ్, పౌరీలో జరిగిన బస్సు ప్రమాదం నా హృదయాన్ని కలిచి వేసింది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. బాధితులను తగిన విధంగా ఆదుకుంటాము’’ అని పేర్కొన్నారు.
पौड़ी गढ़वाल में धुमाकोट रिखणीखाल बस हादसे में उत्तराखंड पुलिस और एसडीआरएफ ने स्थानीय लोगों के साथ मिलकर 21 लोगों को बचाया। @ANI pic.twitter.com/wgrf4HNkee
— Ashok Kumar IPS (@AshokKumar_IPS) October 5, 2022