Crime News: ఈ మధ్య కాలంలో పెద్దలు చెప్పే మంచి మాటలు పిల్లలకు తప్పుగా అనిపిస్తున్నాయి. కొంతమంది యువతీ, యువకులు తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. గట్టిగా మందలిస్తే ప్రాణాలు తీసుకుంటున్నారు. అదీ చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా, తల్లిదండ్రులు సరిగా చదువుకోమని మందలించినందుకు ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని తుమకూరు తాలూకా బెళ్లావికి చెందిన పవిత్ర అనే యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. పవిత్ర చదువుపై కంటే ఎక్కువగా ఆటలు ఆడేందుకు ఉత్సాహం చూపేది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఆటలాడుతూ సమయం వృథా చేస్తుంటావా? సరిగా చదువుకో అని కోప్పడ్డారు.
తల్లిదండ్రుల మాటలే పవిత్ర పాలిట శాపంగా మారాయి. తనను తల్లిదండ్రులు అలా మందలించటం ఆమెకు నచ్చలేదు. దానికి తోడు చదువులో రాణించలేనేమోన్న భయం కూడా పట్టుకుంది. అంతేకాదు! పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు కోప్పడతారని, తాను అడిగిన మొబైల్ ఫోన్ కొనివ్వరని పవిత్ర భావించింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.