ఎలుకను అతి దారుణంగా హత్య చేశాడంటూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు సదరు బాధిత ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ ఎలుక కేసు నమోదైన కారణంతో చనిపోలేదని తేలింది. అది వేరే కారణాల కారణంగా మృత్యువాతపడిందని వెల్లడైంది. ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించిన ఇండియన్ వెటరినరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఈ విషయాలను ధ్రువకరించారు. ఎలుక నీటిలో మునిగి చనిపోలేదని తెలిపారు. అవయవాల విఫలం కారణంగా దాని మరణం సంభవించిందని వెల్లడించారు.
దీనిపై ఐవీఆర్‌ఐ జాయింట్ డాక్టర్ కేపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ నవంబర్ 25న ఎలుక కళేబరాన్ని ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకువచ్చారు. దానికి అశోక్, పవన్ అనే ఇద్దరు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా దాని ఊపిరితిత్తులు వాచి ఉండటం వారు గమనించారు. అంతేకాదు! దాని కాలేయం కూడా పాడైనట్లు గుర్తించారు. దాని ఊపిరితిత్తులలో డ్రైనేజీ నీరు లేదు. కానీ, ఊపిరితిత్తుల పొరలు బాగా చీరుకుపోయి ఉన్నాయి. మనిషి కానీ, జంతువుకానీ, గట్టిగా గాలి పీల్చుకున్నపుడు ఇలా జరుగుతుంది. అది కేవలం ఉక్కపోత కారణంగానే చనిపోయిందని వారు తేల్చారు’’ అని తెలిపారు.
ఇంతకీ ఏం జరిగింది..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తి ఓ ఎలుకను రాయికి కట్టేసి డ్రైనేజీలో పడేశాడు. ఈ దృశ్యాన్ని వికేంద్ర శర్మ అనే వ్యక్తి చూశాడు. అలా చేయోద్దని వారించాడు. అయినా మనోజ్ ఆగలేదు. ఎలుకను మురికి కాల్వలో పడేశాడు. వికేంద్ర ఎంతో కష్టపడి దాన్ని బయటకు తీశాడు. అయితే, అది అప్పటికే చనిపోయింది. ఇకపై ఎలుకలను అలా చంపొద్దని వికేంద్ర.. మనోజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అయితే, మనోజ్ భయపడలేదు. ఇకపై కూడా ఎలుకల్ని అలాగే చంపుతానని అన్నాడు. దీంతో వికేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించారు.