మా నాన్న తాగొచ్చి నా తల్లిని రోజూ ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడు. దయచేసి మా అమ్మను కాపాడండి.. అంటూ 12 ఏళ్ల పిల్లాడు పోలీసులను ఆశ్రయించాడు.
సార్.. మా నాన్న మా అమ్మను కొడుతున్నాడు. మద్యం తాగి వచ్చి రోజూ అదే పనిగా బెల్టుతో కొడుతూ ఉంటాడు. దయచేసి మా ఇంటికి వచ్చి మా అమ్మను కాపాడండి.. అంటూ ఓ 12 ఏళ్ల పిల్లాడు పోలీసులను వేడుకున్నాడు. తన తండ్రి నుంచి తల్లిని కాపాడుకునేందుకు ఆ పిల్లాడు చేసిన పనిని చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మీ కోసం.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని ఓ ప్రాంతంలో హారిఓం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు (12) జన్మించాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. హారిఓం గత కొంత కాలం నుంచి పూర్తిగా మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో రోజూ తాగొచ్చి భార్యను కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఆ బాలుడు తండ్రి దాడిని చూసి తట్టుకోలేకపోయాడు.
ఇక ఇటీవల ఆ పిల్లాడు దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు. ఆ బాలుడుని పోలీస్ అధికారులు గమనించి ఏం జరిగిందని ప్రశ్నించారు. మా నాన్న రోజూ తాగొచ్చి మా అమ్మను ఇనుప రాడ్డు, బెల్టుతో కొడుతున్నాడు. వచ్చి మా అమ్మను రక్షించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఆ పిల్లాడు మాటలు విన్న ఆ పోలీసుల మనసు కరిగి కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి అతని తండ్రిని అరెస్ట్ చేశారు. ఇక తల్లి స్పందించి.. నా భర్త ఇక నుంచి కొట్టనని ప్రమాణం చేశాడని, దయచేసి విడిచిపెట్టండంటూ పోలీసులను వేడుకుంది. దీంతో పోలీసులు హారిఓంను అరెస్ట్ చేశారు.