తప్పు చేసిన వారికి శిక్ష పడటం సహజం. అయితే జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు బుద్ధిగా ఉండాలి అనేం ఉండదు. కొందరు జైలు నుంచి పారిపోయేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పారిపోగలిగినా.. కొందరు మాత్రం దొరికి మళ్లీ తిరిగి జైలుకే వస్తుంటారు.
ఏదైనా తప్పుచేస్తే.. విచారణ జరగడం, దోషిగా తేలితే శిక్ష పడటం జరుగుతూ ఉంటుంది. అలా శిక్ష పడిన వారిని జైలుకు తరలిస్తారు. అక్కడ వారికి పడిన శిక్ష అయిపోయాక విడుదల అవుతారు. అయితే కొందరు మాత్రం జైలు నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది విజయవంతంగా తప్పించుకుంటే.. కొందరు మాత్రం దొరికిపోతుంటారు. కొన్నిసార్లు తప్పించుకోవడానికి వాళ్లు చేసే పనులు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఒక ఇద్దరు ఖైదీలు చేసిన పని అందరినీ నిజంగానే ఆశ్చర్చానికి గురి చేసింది. టూత్ బ్రష్ సాయంతో తప్పించుకున్నారని తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఈ వింత ఘటన వర్జీనియాలో జరిగింది. క్రెడిట్ కార్డు మోసం కేసులో జాన్ గార్జా(37), అర్లె నెమో(43) అనే ఇద్దరికి జైలు శిక్ష పడింది. వారు జైల్లో కొన్నాళ్లు మాములుగానే ఉన్నారు. అయితే వాళ్లు పారిపోయేందుకు భారీ స్కెచ్ వేస్తున్న విషయాన్ని పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. వాళ్లు వారి పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. టూత్ బ్రష్, చిన్న ఇనుప వస్తువుతో గోడకు కన్నం పెట్టడం ప్రారంభించారు. వాళ్లు ఈ పనిని ఎప్పుడు ప్రారంభించారో ఎవరికీ తెలియదు. కానీ, చివరికి వారి లక్ష్యాన్ని చేరుకున్నారు. జైలు గోడకు సక్సెస్ ఫుల్ గా కన్నం పెట్టగలిగారు. ఆ కన్నం నుంచి ఆ ఇద్దరూ పరారయ్యారు.
ఖైదీలు పారిపోయిన విషయం కొన్ని గంటల వరకు ఆ జైలు అధికారులకు, తోటి ఖైదీలకు కూడా తెలియదు. తీరా ఖైదీల అటెండెన్స్ తీసుకునే సమయంలో ఇద్దరు ఖైదీలు తగ్గారు. ఎవరు ఆ ఇద్దరు అని పరిశీలించగా జాన్ గార్జా, అర్లె నెమో అని తేలింది. వెంటనే వారి సెల్ కి వెళ్లి చూడగా.. అక్కడ ఒక కన్నం కనిపించింది. వాళ్లు గోడకు కన్నం ఉండటం గమనించారు. వెంటనే వాళ్ల కోసం గాలింపు ప్రారంభించారు. జైలుకు దగ్గర్లో ఉన్న అపార్ట్ మెంట్స్ లో ఉన్న వాళ్ల వారి సాయంతో పోలీసులు ఆ ఇద్దరు ఖైదీలను పట్టుకోగలిగారు. వారిని వెంటనే మరో సెల్ కి మార్చారు. ప్రస్తుతం టూత్ బ్రష్ తో జైలు గోడకు కన్నం పెట్టిన వీళ్ల స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.