అనుమానం- పెనుభూతమని పెద్దలు ఊరికే చెప్పలేదు. మనిషి మనసులో అనుమానం అనే విత్తనం నాటుకుంటే.. అది పెరిగి పెరిగి పచ్చని కాపురంలో చిచ్చు పెడుతుంది. అలాంటి ఘటనలు ఎన్నో చూసుంటారు. ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆ కోవకు చెందిన ఓ ప్రబుద్ధుడు తన అనుమానంతో చక్కని కాపురాన్ని నాశనం చేసుకున్నాడు. అనుమానంతో భార్యను వేధింపులకు గురి చేశాడు. చీటికి మాటికి సూటిపోటి మాటలతో కాల్చుకు తిన్నాడు. చివరికి ఆ అభాగ్యురాలిపై కత్తితో దాడికి తెగబడి.. ప్రాణాలు తీశాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుధునగర్ లో ఈ ఘటన జరిగింది. ఎన్జీవో కాలనీకి చెందిన కణ్నన్ 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు మగపిల్లలు. అతని భార్య ఎంతో అందంగా ఉండేది. ఆమె అందానికి దాసుడిలా మారిపోయిన భర్త ఆమెను పువ్వుల్లో పెట్టుకు చూసుకునేవాడు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. వారికి రెండో పిల్లాడు పుట్టిన తర్వాత నుంచి వారికి గొడవలు మొదలయ్యాయి. పిల్లాడికి నా పోలికలు రాలేదు అంటూ భార్యతో తరచూ గొడవలు పడేవాడు.
ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానంతో చూసేవాడు. ఆఖరికి కూరగాయలు, పాలవాడితో మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నావు అనే పరిస్థితికి చేరుకున్నాడు. చిన్నబ్బాయికి నా పోలికలు రాలేదు అని వేధింపులు మొదలు పెట్టాడు. ముక్కు, మొఖం కాదు.. కాళ్లు, చేతులు నాకులా లేవంటూ ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు ఆమె కూడా ఎదురు తిరిగి మాట్లాడటం మొదలు పెట్టింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింతగా పెరిగాయి.
జనవరి 10న ఉదయం అదే విషయంలో గొడవ మొదలైంది. వాడు నా కొడుకు కాదు.. ఎవరితో తప్పు చేసి వాడిని కన్నావు? అంటూ పెద్దపెద్ద మాటలు అనడం మొదలు పెట్టాడు. ఆ మాటలకు ఆమె నిర్గాంత పోయింది. ఇంక సహనం కోల్పోయి విచాక్షణారహితంగా కత్తితో భార్యపై దాడికి తెగబడ్డాడు. చుట్టుపక్కలవారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న అనుమానంతో పచ్చని సంసారాన్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాడు. కణ్నన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. హత్య కేసు నమోదు చేశారు.