ఎన్నో ఆశలతో వివాహం చేసుకుంది. ఓ కుమారుడు కూడా పుట్టాడు. కానీ, భర్తతో గొడవలతో విడాకులు తీసుకుంది. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. ఆనందంగా సాగిపోతున్న సమయంలో రెండో భర్త బుద్ధి పెడదారి పట్టింది. అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఆ మహిళతో కలిసి జీవించాలంటూ హింసించడం మొదలు పెట్టాడు. ఆ చేష్టలకు విసిగిపోయిన మహిళ రూ.5 లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ షాకింగ్ ఘటన నిర్మల్ జిల్లాలో సంభవించింది. నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి వివరాల మేరకు.. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచికట్ల శ్రీనివాస్(42) ఓ అనాథ. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఉప్పల్ లో బట్టల దుకాణంలో పనిచేసే మెట్ పల్లి మండలం వేంపేటకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే స్వప్నకు పెళ్లై కుమారుడు ఉన్నాడు. మొదటి భర్తతో విడాకులు కూడా తీసుకుంది. తర్వాత శ్రీనివాస్- స్వప్నలకు ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. వారి జీవితం సాఫీగా సాగిపోతోంది. ఆటో వదిలేసి శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. బాగా సంపాదించాడు. వేంపేట, హైదరాబాద్ లో రెండు ఇళ్లు కూడా కట్టాడు. ఆర్థికంగా ఎంతో బలంగా తయారయ్యాడు.
ఈ గ్యాప్ లో శ్రీనివాస్ బుద్ధి పెడదోవ పట్టింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు ఆ విషయం తెలిసి భార్య నిలదీసింది. ఆమెకు సమాధానం చెప్పకపోగా.. తర్వాతి రోజు నుంచి ఆ మహిళను ఇంటికి తెస్తానంటూ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ మహిళను ఇంటికి తీసుకొస్తాను అందరం కలిసుందామంటూ ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. వేధింపులు తాళలేక స్వప్న షాకింగ్ నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ ను హత్య చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని కుమారులు, అక్క కుమారుడికి కూడా చెప్పింది. అది విని వాళ్లు మనం హత్య చేస్తే ఇరుక్కుంటాం. సుపారీ గ్యాంగ్ తో హత్య చేయిద్దామంటూ సలహా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ‘ఆ కామ పిశాచిని ఉరి తీయండి’
జగిత్యాల జిల్లాకు చెందిన అనిల్, మహావీర్, మధు, సునీల్, శ్రీకాంత్, రాజేందర్ తో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. పథకం ప్రకారం జనవరి 22న రాత్రి సుపారీ గ్యాంగ్.. నిద్రిస్తున్న శ్రీనివాస్ ను రోకలి బండతో కొట్టి చంపారు. అతని ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. కుమారులు.. మృతదేహాన్ని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వాగులో పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసలు విషయాన్ని ఛేదించారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రోకలి బండ, 73 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్వప్న చేసిన పని ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.