పదేళ్లుగా అతడే సర్వస్వం అని నమ్మింది. మనసు, తనువు అర్పించుకుంది. పెళ్లి పీటలెక్కాలని కలలు కనింది. నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంది. కానీ, అతని ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వీలైనంత వరకు వాడుకుని వదిలేయాలనుకున్నాడు. శారీరక వాంఛలు తీర్చుకునే ఒక వస్తువుగా మాత్రమే ఆమెను చూశాడు. చివరకు మోజు తీరిపోవడంతో ఇంట్లో వాళ్లు చూపించిన సంబంధం చేసుకునేందుకు ఓకే చెప్పేశాడు.
వివరాల్లోకి వెళితే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ తాలూకా అరభికొత్తనూరు గ్రామంలో జరిగింది. అంభికా అనే యువతి మహేశ్ ను గాఢంగా ప్రేమించింది. అతనే సర్వస్వం అని నమ్మి నిలువునా మోసపోయింది. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. కానీ, అతను వేరే అమ్మాయిని పెళ్లాడేందుకు నిశ్చితార్థం కూడా చేసుకున్నాడని తెలిసి షాక్ అయ్యింది. మహేశ్ ను నిలదీసింది. ఇలా మోసం చేస్తావా అంటూ ప్రశ్నించింది. మహేశ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది.
మహేశ్ పై యువతి రేప్ కేసు పెట్టింది. పోలీసులు మహేశ్ ను అరెస్టు చేశారు. అంభికను వివాహం చేసుకోవడం తప్ప అతనికి మరో మార్గం దొరకలేదు. వెంటనే అంభికను పెళ్లాడాడు. ఆ తర్వాత మరో షాకింగ్ ట్విస్టు ఇచ్చాడు. పెళ్లైన తర్వాత నుంచి మహేశ్ కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్లాడో, ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని అంభిక అత్తవారింటి ముందు దీక్షకు దిగింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ డిమాండ్ చేసింది. తన కుమార్తె జీవితంతో ఆడుకుంటున్నారంటూ అంభిక తండ్రి వాపోతున్నాడు. కేవలం కేసు నుంచి తప్పించుకోవడానికే తన కుమార్తెను వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. మహేశ్ కు మరో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. తమకి పోలీసులే న్యాయం చేయాలని.. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ విలపిస్తున్నారు.