అమ్మ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించడం ఎవరి తరం కాదు.. ఈ భూలకంలో తనకు బదులుగా ఆ భగవంతుడు అమ్మను సృష్టించారని అంటారు. నవమాసాలు కనీ పెంచే తల్లి పిల్లల ఏ చిన్న ఇబ్బంది వచ్చినా విలవిలాడిపోతుంది. తన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటుంది.
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే మనస్థాపానికి గురై తమ జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో నూరేళ్ల తమ జీవితాన్ని మద్యలోనే ముగించేస్తున్నారు. తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. నవమాసాలు మోసీ కనీ పెంచిన తన కొడుకు కళ్లముందే చనిపోతే ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. తన కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తాను కూడా తనువు చాలించింది. ఈ విషాద సంఘటను జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా ఆత్మకూర్ కి చెందిన నేరెళ్ల లక్ష్మీరాజం-రాజ గంగు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు పేరు శివకుమార్. చిన్ననాటి నుంచి ఈ దంపతులు ఎన్నో కష్టాలు పడి పెంచారు. ఇటీవల ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. కుమారుడికి మంచి భవిష్యత్ చూపించాలనే కష్టపడి చదివిస్తున్నారు. కాలేజ్ వెళ్లి చదువుకుంటున్న శివ కుమార్ మూడే నెలల క్రితం వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న తమ కొడుకు అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం తల్లితండ్రులు షాక్ కి గురయ్యారు. అందరితో ఎంతో సంతోషంగా ఉండే శివకుమార్ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులే కాదు.. గ్రామస్థులు సైతం విషాదంలో మునిగిపోయారు.
ఈ సంఘటన తర్వాత లక్ష్మీరాజం ఉపాది కోసం దుబాయ్ వెళ్లారు. ఇంట్లో రాజగంగు ఒంటరిగా ఉంటుంది. తన కొడుకు మరణం జీర్ణించుకోలేక కుంగిపోయింది. కొడుకు తరుచూ గుర్తుకు వస్తున్నాడని.. తనని పిలుస్తున్నాడని బంధువులు, చుట్టుపక్కల వారితో చెపి కన్నీరుమున్నీరయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.. తల్లికి కూతుళ్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో కంగరు పడ్డారు. వెంటనే గ్రామానికి చేరుకొని బంధువులతో కలిసి వెతికారు. ఈ క్రమంలో ఊరు శివారులో ఓ వ్యవసాయ బావిలో రాజగంగు మృతదేహం లభ్యమైంది. కొడుకు జ్ఞాపకాలు తట్టుకోలేక తల్లి కన్నుమూయడంతో కూతుళ్లు బోరున విలపించారు. దీంతో గ్రామం విషాదచాయలో మునిగిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.