కొందరు పెళ్లి, సంసారం, పిల్లలు, పరువు, బాధ్యతలు ఇలాంటి పదాలకు అర్థాలు కూడా తెలియకుండా బతికేస్తున్నారు. మూడుముళ్ల బంధాన్ని అవహేళన చేస్తూ.. ఐదు నిమిషాల సుఖం కోసం చీకటి సంసారాలకు తెర లేపుతున్నారు. వారి తెరచాటు సంసారానికి అడ్డొస్తే అది భర్తయినా, భార్యయినా, కన్నపిల్లలైనా కడతేర్చేందుకు వెనకడుగు వేయడం లేదు. అలాంటి ఓ ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మోజు పడిన వాడికోసం ప్రేమించి పెళ్లాడిన భర్తనే కాటికి పంపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన జయచిత్ర నాగరాజు, నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సోనీ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇల్లు గడవడం కోసం నాగరాజు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఉన్నట్లుండి నాగరాజు కనిపించకుండా పోయాడు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడితో బంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భార్యే హత్య చేసినట్లు తేలింది.
సోనీకి పొన్నూరులో వెంకటసాయి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం అక్రమ సంబంధానికి తెర లేపింది. తరచూ వెంకటసాయితో సోనీ ఏకాంతంగా కలవడం మొదలు పెట్టింది. కొన్నాళ్లకు ఆ విషయం నాగరాజుకు కూడా తెలిసిపోయింది. భార్యను ఆ విషయంలో నాగరాజు మందలించాడు. ఇంక ప్రియుడితో కలవడం కుదరదని భావించిన సోనీ.. అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. అందుకు వెంకటసాయి కూడా ఒప్పుకున్నాడు. ఓరోజు నాగరాజుకు నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టింది. అతను స్పృహ కోల్పోగానే ప్రియుడుకి ఫోన్ చేసింది. అతను మరో మిత్రుడిని తీసుకుని నాగరాజు ఇంటికి వచ్చాడు. అతడిని హత్యచేసి మృతదేహాన్ని బాపట్ల దగ్గర్లో ఓ కాలవలో పడేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
అయితే అసలు విషయాన్ని సోనీ తన సోదరికి చెప్పింది. భయంతో హడలిపోయిన సోనీ సోదరి.. ఆ విషయాన్ని మృతుడి సోదరుడికి తెలియజేసింది. నాగరాజు సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అసలు నిజాలను కనుగొన్నారు.