ప్రతి ఒక్కరు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఏవేవో సాధించాలని, సమాజంలో తమకంటూ గుర్తింపు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేస్తుంటారు. ఇక వారి లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో విధి వారిపై పగపడుతుంది. అనుకోకుండా జరిగే ఘటనలతో వారి జీవితాలు తిరగపడిపోతాయి. అలానే కొందరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు యువత.. పెళ్లి వేడుకలో ఈవెంట్ చేసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాలోని పూరిలో ఓ పెళ్లి వేడుకలో ఈవెంట్ నిర్వహించేందుకు రాఖీ(35), మరియాఖాన్(24), కబీర్(28), లక్ష్మీ(28)లు విశాఖ నుంచి బయలు దేరారు. ఆంధ్ర సరిహద్దులో దాటి ఒడిశాలోకి వెళ్లిన తరువాత ఖుర్ధా జిల్లా బొడొ పొఖొరియా గ్రామం మూల మలుపు వద్ద సాంకేతిక లోపంతో ఓ లారీ రోడ్డుపై ఆగి ఉంది. ఈక్రమంలో సుమారు 4 గంటల సమయంలో ఈవెంట్ కోసం వెళ్తున్న వీరి వాహనం ఆ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. అయితే పొగమంచు కారణంగా ముందు వాహనం కనపడక పోవడం, అదే విధంగా కారు డ్రైవర్ వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు విశాఖపట్నంకి చెందిన వారు కాగా మరొకరు వేరే ప్రాంతాన్నికి చెందిన వ్యక్తి.
మృతుల్లో ఒకరైన మరియాఖాన్ కి బ్యూటీషియన్ గా మంచి పేరుంది. ప్రముఖ ఈవెంట్లకి మేకప్ కాంట్రాక్ట్ లు తీసుకుటుంది.ఈమె ఇతర రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్లకు సైతం వెళ్తుంది. విశాఖలోని పాండురంగాపురంలో బ్యూటీషియన్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఇక మరొక మహిళ లక్ష్మీ కూడా మరియాఖాన్ కి అసిస్టెంట్ గా పనిచేస్తుంది. పూరిలో పెళ్లి ఈవెంట్ ఉందని చెప్పి, తాము వద్దన్నా వినకుండా ఇంటి నుంచి వెళ్లి ఇలా మృతిచెందిదని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్ష్మికి ఇంటర్ చదువుతున్న ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు.
ఇక రాకేష్..తన తల్లితో కలిసి విశాలాక్షి నగర్ నివాసం ఉంటున్నాడు. ఇతడి తండ్రిలేడు… అక్కకు ఇటీవలే వివాహం అయింది. వారి కుటుంబానికి రాకేష్ ఆధారం. ఇక కబీర్ అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వాడు. అతడు ఏయూలో చదువుకుని ఫోటో గ్రాఫర్ గా ఇక్కడే ఉంటున్నాడు. ఇలా నలుగురు కలసి పూరిలోని పెళ్లి వేడుకలో ఈవెంట్ నిర్వహించేదుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించారు.