నేటికాలంలో ఆత్మహత్య ఘటనలు బాగా పెరిగిపోయాయి. సమస్య ఎలాంటిదైన చావే పరిష్కారంగా భావిస్తున్నారు కొందరు. అలా క్షణికావేశంలో నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వరకట్న వేధింపులతో కూడా కొందరు మహిళలు.. తనువు చాలిస్తున్నారు. తాజాగా ఓ వివాహిత వరకట్న వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ ఉద్యోగం చేస్తూ.. ఇంటికి చేదోడుగా ఉంటుంది. అయినా అత్తింటి వారు నిత్యం వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన వేముల గుర్నాథం దంపతులకు అభినవ్య(22) అనే కుమార్తె ఉంది. నవ్యను అదే జిల్లా ఎ.కొండూరు మండలం కొఠారుపూడి గ్రామానికి చెందిన సీతారామరాజు అనే వ్యక్తితో వివాహమైంది. సీతారామరాజుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని హెటీరో ఫార్మా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో ఈ దంపతులు ఇద్దరు పాయకరావుపేటలోని పెదిరెడ్డి సన్యాసి రావు నగర్ లో అద్దెకు ఓ ఇళ్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. శుక్రవారం అర్ధరాత్రి తరువాత అభినవ్య ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మరణవార్త తెలిసి అభినవ్య తల్లిదండ్రులు భోరున విలపించారు. అభినవ్య ఆత్మహత్యపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అల్లుడు తరచూ తమ కుమార్తెను అదనపు కట్నం కావాలని వేధించేవాడని, ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. పెళ్లికి ముందు కట్నంగా రూ.5 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చామన్నారు. అయినా తృప్తి చెందగా అదనపు కట్నం తేవాలని..తమ కూతుర్ని వేధించే వాడని ఆమె తండ్రి ఆరోపించాడు. అభినవ్యను శారీరకంగా, మాసికంగా తరచూ వేధించేవాడని, అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసేవాడన్నారు. ఇటీవలే క్రితమే మరో రూ.2 లక్షలు ఇచ్చామని వివరించారు. భర్త ఇంకా బాధలు పెడుతుంటంతో భరించలే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అప్పలరాజు తెలిపారు.