బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో చాలా మంది సామాన్యులు మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. మరికొందరు ఊరు విడిచి వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇంకొందరు బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు వేధింపులకు యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతు పేటకు చెందిన జాస్తి ప్రభాకర్ కూతురు జాస్తి వర్షిణి. ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమతలేక ఇంటి వద్ద ఉంటుంది. నీట్ ఎగ్జామ్ కి కూడా ప్రిపేర్ అవుతుంది. వీరి కుటుంబం కూడా ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంది. దీంతో ప్రభాకర్ గతంలో తీసుకున్న అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు వారి ఇంటి వద్దకు వచ్చి అవమానించారు. అధికారులు మాట్లాడిన మాటలను వర్షిణి జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జాస్తి వర్షిణి ఉన్నత విద్య అభ్యసింటడానికి ఆర్థిక స్థోమత లేక, చదువుకోలేక, అప్పులు అవమానాలతో వర్షిణి తీవ్రంగా మనస్తాపం చెందింది. తమ బిడ్డను బ్యాంకు అధికారులే చంపేశారంటూ మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
“ఇక మీ పిల్లలను గేదెలు కాయించండి” అంటూ బ్యాంకు అధికారులు అవమానించారని, తన కుటుంబాన్ని అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వర్షిణి ఈ దారుణ నిర్ణయం తీసుకుందని ఆమె తల్లి తెలిపింది. మాములు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, బ్యాంకు అధికారులు ఎంతో అవమానకరమైన మాటలు మాట్లాడి ఉంటేనే ఈ నిర్ణయం తీసుకోని ఉంటుందని మృతురాలి బంధువు ఒకరు తెలిపారు. వేల కోట్లు రుణాలు ఎగవేసే వారిని ఏం చేయలేరు, కానీ సామాన్యులను మాత్రం బ్యాంకు అధికారులు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తుంటారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.