అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఘోరం జరిగింది. వారం క్రితమే అమెరికా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అత్యంత ఘోరంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ప్రతి చిన్న విషయానికి పగలు, ప్రతీకారాలు అంటూ ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీసేందుకు తెగబడుతున్నరు. ఇలా కారణాలు ఏమైనప్పటికి తరచూ హత్యాఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దొంగతనాలకు వచ్చిన వారు సైతం తమకు అడ్డు వచ్చిన వారిని అత్యంతం పాశవికంగా హతమారుస్తున్నారు. గతంలో ఒంగోలు ప్రాంతంలో జరిగిన తల్లీ,బిడ్డల హత్యోదంతం అందరికి తెలిసిందే. అలానే ఓ దంపతులను రాడ్ తో కొట్టి దారుణంగా చంపిన ఘటనకు చోటుచేసుకుంది. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో అలాంటి దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. వారం క్రితం అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ని నట్టి నడి ఇంట్లో కత్తులతో పొడి చంపేశారు. అడ్డువచ్చిన అతడి డ్రైవర్ ను సైతం కత్తులతో దారుణంగా పొడి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన హేమ కోటిరెడ్డి(65), సరోజమ్మ అనే దంపతులు బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరు అమెరికాలో స్థిరపడిపోయారు. ఈ దంపతులు మాత్రం గుంతకల్లులోని తమ నివాసం ఉంటున్నారు. కోటిరెడ్డి వడ్డీ వ్యాపారం చేసేవారు. ఆయనకు పట్టణంలో కొన్ని కాంప్లెక్స్ లు, స్థలాలు ఉన్నాయి. అయితే కొంతకాలం క్రితం పిల్లలను చూసేందుకు ఈ దంపతులు అమెరికా వెళ్లారు. వీరు అమెరికాలో ఉన్నంతకాలం వీరి ఇంటిని పనిమనిషి వహిదా చూసుకునేది. ఆమె కుమారుడు షేక్షావలి కూడా కోటిరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో వారం క్రితం కోటిరెడ్డి ఒక్కరే అమెరికా నుంచి గుంతకల్లుకు తిరిగి వచ్చారు. భార్య సరోజమ్మ పిల్లల వద్దనే ఉంది.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు కోటిరెడ్డి ఇంటికి వచ్చారు. ఎవరూ మీరు, ఎందుకు వచ్చారని పనిమనిషి వహిదా వారిని ప్రశ్నించింది. దీంతో తమని రాము పంపించారని.. రెడ్డిని కలవాలని చెప్పారు. తర్వాత పనిమనిషి వారిని హాలులోకి తీసుకెళ్లింది. కొద్దిసేపటికి లోపలి నుంచి హాల్ లోకి వచ్చిన కోటిరెడ్డిని.. ఆ ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ఒకసారిగా జరిగిన ఈ పరిణామంతో పనిమనిషి భయాందోళనకు గురై.. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో దుండగలు బయటకు పరుగులు తీశారు. వారిని గుర్తించిన ఆమె కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిందితులు అతడిపై కూడా విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపేశారు.
పనిమనిషి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పనిమనిషిని చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇంకో దారుణం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల క్రితం కోటిరెడ్డి సోదరుడు నీలకంఠారెడ్డి కూడా దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా అన్న కూడా కత్తులకు బలయ్యారు. జంట హత్యలతో గుంతకల్లు పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.