‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ థియేటర్లలో, ఇతర ప్రాంతాల్లో ప్రకటనలు వేస్తుంటారు. అయితే మద్యపానంతో మనిషి ఆరోగ్యమే కాదు సమాజ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మందు కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. మద్యంకి బానిసగా మారిన కొందరు డబ్బుల కోసం భార్య, పిల్లలను వేధిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు మద్యం మత్తులో వావివరుసలు మరచి మృగంలా ప్రవర్తిస్తుంటారు. తాగిన మైకంలో మహిళలపై ఆత్యాచారాలకు పాల్పడుతుంటారు. అంతేకాక మరికొన్ని సందర్భాలో హత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా కొందరు మందుబాబులు కుక్కలపై దుశ్చర్యానికి పాల్పడ్డారు. మందులో మంచింగ్ కోసం రెండు కుక్కల చెవులు, తోక కత్తిరించారు. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలి జిల్లా, ఫరీదాపూర్ ప్రాంతంలో ముఖేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు నిత్యం మద్యం తాగి రోడ్ల వెంట తిరిగే వాడు. అంతేకాక తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు మద్యం సేవించేవాడు. అలానే ఇటీవల తన స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడు. మద్యం తాగిన మత్తులో వారికి మంచింగ్ పై ఆలోచన వచ్చింది. వెంటనే మందులోకి మంచింగ్ కోసం ఏదైన తెచ్చుకోవాలని ముఖేష్.. తన స్నేహితుడితో కలిసి బయటకు వచ్చాడు. అదే సమయంలో అటుగా రెండు కుక్కపిల్లలు వెళ్లడానికి వారిద్దరు గమనించారు. వెంటపడి ఆ కుక్కపిల్లలను పట్టుకున్నారు. ఒక దానికి రెండు చెవులు కోశారు. మరొక కుక్కపిల్ల తోకను కట్ చేశారు. కాగా, కుక్కపిల్లల అరుపులు విన్న స్థానికులు బయటకి వచ్చి చూడగా అవి రక్తం కారుతూ కనిపించాయి. వెంటనే వారికి విషయం అర్థమయ్యింది.
దీంతో వారు మూగప్రాణుల కోసం పనిచేసే ఓ సంస్థకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ సంస్థకు సంబంధించిన అధికారులు వెంటనే అక్కడి చేరుకుని కుక్కల పిల్లలను పరిశీలించారు. గాయాలైన ఆ కుక్కలకు వెంటనే చికిత్స అందించారు. తరువాత ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మూగజీవాల రక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ మందుబాబుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా మందు మత్తులో కొందరు ఘోరమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి.. మద్యం మత్తులో కన్నతల్లిని దారుణంగా కొట్టి.. సజీవంగా పూడ్చిపెట్టాడు. ఇలా ఒకటీరెండు కాదు.. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మరీ.. మద్యం కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.