వివిధ రకాల వేధింపుల కారణంగా నిత్యం ఎదో ఒకచోట ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల రుణాలకు సంబంధించిన వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా ఆన్ లైన్ రుణాలు, సూక్ష్మరుణాలు మొదలైన వంటి వాటి కారణంగా ఎందరో అమాయకలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైక్రో ఫెనాన్స్ కంపెనీ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించడం అత్తాకోడళ్ల ప్రాణాలు తీసింది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం పంచాయతీ పరిధిలో బెల్లంకొండవారి మెరకు చెందిన సుందర వెంకటేశ్వరరావు, అంజమ్మ దంపతులు. వీరి కుమారుడు రవిబాబు కు భారతి అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. హాయిగా సాగుతున్న వీరి జీవితంలో సూక్ష్మరుణం సమస్యలను సృష్టించింది. రవిబాబు భవన నిర్మాణ కార్మికుడు. ఇంటి నిర్మాణం కోసం రెండు ప్రైవేటు మైక్రో ఫెనాన్స్ సంస్థల నుంచి అయిదేళ్ల క్రితం రుణం తీసుకున్నాడు. తండ్రీకొడుకులు తీసుకున్న రుణానికి వాయిదాలు సక్రమంగానే చెల్లిసూ వచ్చారు. పుల్ట్రాన్ అనే సంస్థలో తీసుకున్న రూ.5.50 లక్షల రుణానికి నెలకు రూ.12,500 చొప్పున ఇప్పటి వరకూ 56 వాయిదాలు చెల్లించారు. ఇక డిసెంబర్ 7న మరో వాయిదాను చెల్లించాల్సి ఉంది. అయితే అనుకోని కారణంగా ఆ డబ్బులు కట్టండం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న సదరు సంస్థకు చెందిన ఉద్యోగులు రవిబాబు ఇంటికి వచ్చి రుణం వెంటనే చెల్లించాలని లేకపోతే ఇంటికి తాళం వేసి.. వేలం వేస్తామని బెదిరించారు. వారు హెచ్చరిస్తున్న సమయంలో భారతి సైతం అక్కడే ఉన్నారు.
దీంతో రుణం చెల్లించడం విషయంలో భారతి(24) ఆందోళనకి గురై.. శనివారం గుండెపోటుతో మృతి చెందారు. అయితే కోడలి మరణంతో కలత చెందిన అత్త అంజమ్మ(57) ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకున్నారు. కాసేపటి సమయం తరువాత బయటకు వెళ్లిన రవిబాబు ఇంటికి వచ్చాడు. అక్కడ తల్లి అంజమ్మ ఉరివేసుకుని ఉండటం గమనించి.. వెంటనే ఆమెను కిందకు దించాడు. అయితే అప్పటికే అంజమ్మ మరణించింది. దీంతో రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రవిబాబు, భారతి దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అభంశభం ఎరుగని ఆ చిన్నారులకు అన్ని తామై చూసే తల్లి, నాయనమ్మ ఒకేసారి దూరమయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి