నల్గొండ జిల్లా… మిర్యాల గూడ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా… మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 10 మంది వరకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సీట్ల మధ్యలో కొందరు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. పోలీసులు వారిని అతి కష్టం మీద కాపాడారు. మృతులను నాగేశ్వరరావు(44), జయరావు(42), మల్లికార్జున్(40)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. నిద్రమత్తులో ఉండబట్టే డ్రైవర్ లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దాచేపల్లిలోనూ ఓ ఆటోను ఢీకొట్టబోయి… కొద్దిలో తప్పించాడని ప్రయాణికులు తెలిపారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది.