కర్నూలు జిల్లాలో తోడికోడళ్ల జంట హత్య ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే పిల్లలు లేరనే కారణంతోనే మామ కొడుకులతో కలిసి తోడికోడళ్లలను దారుణంగా హత్య చేయించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలంగా మారింది. అయితే ఈ ఘటనలో తాజాగా కీలక ఆధారాలు దొరికినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరికిన ఆ ఆధారాలు ఏంటి? పోలీసులు ఈ కేసును ఎలా చేధించారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుందాం.
అది ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు. ఇదే గ్రామంలో పెద్ద గోవిందు, రామ గోవిందు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వీరిద్దరికి గతంలోనే వివాహాలు జరిగాయి. పెద్ద గోవిందుడికి రామేశ్వరితో వివాహం జరగగా, రామ గోవిందుకి రేణుక అనే మహిళతో పెళ్లి జరిగింది. అయితే ఈ అన్నదమ్ములకు వీరి ఊళ్లో 30 ఎకరాల భూమి ఉంది. దీంతో వీరి కుటుంభంలో ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాలేదు. ఇకపోతే పెళ్లైన చాలా కాలం వరకు వీరిద్దరి దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా వీరి కాపురం సుఖ సంతోషాలతో ఆనందంగా గడుస్తున్నా.. పిల్లలు కలగలేదన్న బాధ మాత్రం వీరిని తరుచు వేధిస్తుండేది. ఈ క్రమంలోనే ఈ కోడళ్ల మామ అయిన గోప్పన్న కూడా తన కోడళ్లకు పిల్లలు కలగడం లేదని ఎప్పుడూ బాధపడుతుండేవాడు. అలా అతని బాధ రోజు రోజుకి అతడిని క్రూరంగా మారేలా చేసింది.
నా ఇంట్లోకి కోడళ్ల రాకతో అంతా అశాంతి నెలకొనడమే కాకుండా నాకు ఆరోగ్యం కూడా సరిగ్గ లేదని అనుకున్నాడు. వీటన్నిటికీ కారణం నా కోడళ్లే అనుకున్నాడు. ఇక ఇదే కాకుండా వీళ్లు చేతబడి చేయించడమే కారణంగానే మా సంసారం ఇలా అయిందని మామ గోపన్న అనుకున్నాడు. ఈ సమయంలోనే మామ గోపన్నకు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే తన ఇద్దరి కొడుకులకు మళ్లీ పెళ్లిళ్లు చేయడం. కానీ అడ్డుగా కోడళ్లు ఉండడంతో మామ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత గోపన్నకు వచ్చిన ఆలోచనే తన ఇద్దరి కోడళ్లను చంపడం. ఇక అతను అనుకున్నదే ఆలస్యం.. వెంటనే తన ఇద్దరి కుమారులను మాటలతో నమ్మించాడు. మీకు పిల్లలు కలగడం లేదని, మరో పెళ్లిళ్లు చేస్తానంటూ మరెన్నో మాయమాటలు చెప్పాడు. ఇక తండ్రి మాటలను కాదనని ఇద్దరు కొడుకుల సరేనంటూ భార్యల హత్యకు ప్లాన్ గీశారు. ఇందులో భాగంగానే ఈ నెల 14న కుటుంబ సభ్యులు అందరూ కలిసి పొలానికి వెళ్లారు. ముందుగా మామ గోపన్న ఇద్దరు కోడళ్లను గడ్డి కోయాలంటూ చెప్పి పంపించాడు. వీరిద్దరూ కలిసి గడ్డి కోయడానికి వెళ్లారు.
దీంతో పక్కలా ప్లాన్ తో వెళ్లిన అన్నదమ్ములు పెద్ద గోవిందు, రామ గోవిందు ఇద్దరి భార్యలను వెనకాల నుంచి కొట్టి చంపారు. ఈ దాడిలో రామేశ్వరితో పాటు రేణుక ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తమ ఇద్దరి భార్యలను ఎవరో హత్య చేశారని అన్నదమ్ములు కొత్త నాటకానికి తెర లేపారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరి మహిళల తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా ముందుగా మామ గోపన్నను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఘటన స్థలాన్ని మరోసారి పరిశీలించగా గోవిందు చెప్పులు బయటపడ్డాయి. దీంతో పోలీసుల స్టైల్ లో తండ్రి గోపన్నతో పాటు ఇద్దరు కొడుకులను విచారించగా అసలు నిజాలు బయటపెట్టారు. ఇద్దరి కోడళ్ల హత్యకు నేనే ప్లాన్ వేశానని గోపన్న ఒప్పుకున్నాడు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పిల్లలు లేరన్న కారణంతో సొంత మామే కోడళ్లను చంపాలనుకోవడం ఎంత వరకు సమంజసం. అసలు ఇలాంటి దుర్మార్గులికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.