2022, డిసెంబర్ 31 రాత్రి ఎంతో మంది జీవితాల్లో విషాదాలు నింపింది. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని కొందరు, ప్రిపేర్ అవుతూ కొందరు విగతజీవులుగా మారారు. మరికొంత మంది ఆసుపత్రిపాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల అంజలి కారు ప్రమాదానికి గురైంది. దారుణమైన స్థితిలో మరణించింది. ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాకు చెందిన స్వీటీ సింగ్ అనే యువతి అక్కడి ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే మిత్రురాళ్లతో కలిసి ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో స్వీటీ ఆమె మిత్రురాళ్లు కర్సోనీ, అంగంబ కలిసి రోడ్డుపై వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ శాంత్రో కారు వీరిని ఢీకొట్టింది. ఆపకుండానే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్వీటీ తలకు తీవ్ర గాయం అయింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై వెళుతున్న వారు వీరిని ఆసుపత్రికి తరలించారు. స్వీటీ మిత్రుడు శివమ్ దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడు మాట్లాడుతూ ‘‘నేను ప్రమాదం జరిగినపుడు కర్సోనీతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాను.
సెమిస్టర్ ఫీజు చెల్లించే విషయం గురించి మాట్లాడుతున్నాం. కొద్ది సేపటి తర్వాత పెద్ద కేక వినపడింది. ఆ వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత నేను నా స్నేహితులతో కలిసి వారుండే రూము దగ్గరకు వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత కర్సోనీకి మళ్లీ ఫోన్ చేశాను. ఆస్పత్రిలో ఉన్నామని చెప్పింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి వైద్యులు తలకు గాయం అయిన స్వీటీకి సర్జరీ చేశారు. ఆమె పరిస్థితి కొంచెం బాగోలేదు. కారు ఢీకొట్టిన వేగానికి స్వీటీ గాల్లోకి ఎగిరి ఆవతల పడింది’’ అని తెలిపాడు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు, నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు. డాక్టర్లు ఆమె కచ్చితంగా బతుకుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి, కారు ప్రమాదం కారణంగా ఆసుపత్రి పాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న స్వీటీ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.