ఆమె పేరు కునిదాస్ సీమాదాస్. ఒరిస్సాలోని భువనేశ్వర్ ఆమె స్వస్థలం. కునిదాస్ అదే ప్రాంతానికి చెందిన జగన్నాథ్ గౌడ అనే వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించింది. అతడితో మిగిలిన జీవితం పంచుకోవాలనుకుంది. ప్రతిరోజు అతడితో గడపబోయే జీవితం గురించి కలలు కనేది. వీలైనంత తొందరగా ప్రియుడితో సంసార జీవితాన్ని మొదలుపెట్టాలని భావించింది. అతడ్ని తరచూ పెళ్లి గురించి అడిగేది. అతడు పెళ్లి విషయం వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆమె అతడిపై మరింత ఒత్తిడి తెచ్చింది. దీంతో ఓ రోజు పెళ్లికి సరేన్నాడు. ఇంట్లోంచి లేచిపోయి సూరత్‌లో పెళ్లి చేసుకుందాం అని ఆమెతో చెప్పాడు. అమ్మానాన్నలు, కుటుంబసభ్యుల గురించి ఆమె ఆలోచించలేదు. ప్రియుడితో కలిసుంటే చాలు అనుకుంది.
అతడితో పాటు గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక జగన్నాథ్ ఆమెను ఓ ఆటోలో ఊరికి దూరంగా తీసుకెళ్లాడు. సూరత్ మొత్తం చూపిస్తానని కునిదాస్‌తో చెప్పాడు. ఆటో దిగిన తర్వాత ఆమెను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాదాపు 49 పోట్లు పొడిచి ఆమెను చంపేశాడు. అక్కడే శవాన్ని పడేసి భువనేశ్వర్ వెళ్లిపోయాడు. ఏమీ తెలియనట్లు తన పనిలో తాను మునిగిపోయాడు. కొద్దిరోజుల తర్వాత పోలీసులకు కునిదాస్ మృతదేహం దొరికింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చాలా మందిని ఆ యువతి గురించి విచారించారు. అయితే, ఆమెది గుజరాత్ రాష్ట్రం కాకపోవటంతో ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ నేపథ్యంలోనే సిటీ బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్‌లతో పాటు సీసీటీవీలు ఉన్న అన్ని ఏరియాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. మృతురాలి ఒంటిపై ఉన్న టీషర్టు ఆధారంగా ఆమెను భువనేశ్వర్‌కు చెందిన కునిదాస్‌గా గుర్తించారు. భువనేశ్వర్‌కు వెళ్లి విచారించగా జగన్నాథ్‌తో ఆమెకు ఉన్న ప్రేమ బంధం బయటపడింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం వెలుగుచూసింది. అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.