జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లేస్టోర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మాల్వేర్తో ఉన్న యాప్స్ డేంజరస్ కావడంతో యూజర్లకు నష్టం తప్పట్లేదు. రెండు నెలల క్రితం జోకర్ మాల్వేర్ ఉన్న 11 యాప్స్‌ని తొలగించింది గూగుల్. ఇటీవల మరో 6 యాప్స్‌ని రీసెర్చర్స్ గుర్తించడంతో వాటిని కూడా ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలో కూడా జోకర్ మాల్వేర్తో ఉన్న 24 యాప్స్ తొలగించింది. ఇప్పుడు జోకర్ మాల్వేర్ ఉన్న మరో 17 యాప్స్ లిస్ట్ బయటపడింది. ఈ మాల్వేర్ ఎస్ఎంఎస్ మెసేజెస్, కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ సమాచారాన్ని కాజేస్తున్నట్టు తేలింది. వీటిని కూడా తొలగించింది గూగుల్.
మొదటిసారి 2017లో జోకర్ మాల్వేర్ చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని గూగుల్ ప్రకటించుకుంది. కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్ కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పుడు జోకర్ మాల్వేర్ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేయడం విశేషం.
జోకర్ యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ యూజర్‌కు మెసేజ్ వచ్చినా అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.