సికింద్రాబాద్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి భార్య కన్నుమూసింది. దీనిని తట్టుకోలేక భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట్ జిల్లా మక్తల్ లో ఉప్పరి నవీన్ కుమార్ అనే యువకుడు ఇదే గ్రామానికి చెందిన భీమేశ్వరి అనే యువతిని కొన్నాళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఎలాంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అయితే భీమేశ్వరికి ఈ నెల 18న పురుటి నొప్పులు రావడంతో వెంటనే హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. భీమేశ్వరికి చికిత్స అందిస్తూ పాపను వెంటిలేటర్ పై ఉంచారు. ఇక చికిత్స పొందుతున్న భీమేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించింది.
పుట్టిన బిడ్డ వెంటిలేటర్ పై, భార్య మార్చురీలో ఉండడంతో భర్త నవీన్ కుమార్ తట్టుకోలేకపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కన్నుమూయడంతో భర్త తట్టుకోలేక రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా నవీన్ కుమార్ గా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గాంధీ ఆస్పత్రిలోని మార్చురీలో భార్యాభర్తల మృతదేహాలు, అదే ఆస్పత్రిలో కూతురు వెంటిలేటర్ పై ఉండడంతో వారి కుటుంబ సభ్యుల కంట కన్నీరు ఆగలేదు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.