నేటి సమాజంలో ఈజీ మనీకి బాగా అలవాటు పడిన మనుషులు.. దారి తప్పుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అత్యాశకు పోతున్నారు. దాంతో తమ బుర్రలకు పదును పెట్టి రకరకాలుగా డబ్బు సంపాదించడానికి దొంగచాటుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద ప్లాన్ వేసిన ముఠా.. పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలైంది. తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన పులి చర్మం వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వారు అమ్మకానికి పెట్టిన పులి చర్మం అసలు పులి చర్మమే కాదు. అది కుక్క చర్మం.. అని అటవీ అధికారుల రిపోర్టుల్లో తేలింది. సినిమాను తలపించే ఈ కథ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కానూరి వంశీ వెంకట లక్ష్మీనారాయణ రెస్టారెంట్ బిజినెస్ చేశాడు. ఆ వ్యాపారాల్లో నష్టాలు రావడంతో.. ప్రస్తుతం క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. దాంతో విజయ్ తన దగ్గర పులి చర్మాలు, దంతాలు, గోర్లు, పంచలోహ విగ్రహాలు ఉన్నాయని నమ్మించాడు. వీటికి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని చెప్పాడంతో.. వీటిని ఒరిజినల్ అని చెప్పి అమ్మి కోట్లల్లో డబ్బులు సాంపాదించోచ్చని తెలిపాడు. దాంతో అతడి మాటలు నమ్మిన లక్ష్మీనారాయాణ వాటిని రూ. 10 వేలకు కొన్నాడు. ఆ తర్వాత వీటిని గన్నవరం ప్రాంతంలో అమ్మడానికి పూనుకున్నాడు.
ఈ క్రమంలోనే కానూర్ శ్మశానం దగ్గర కొంత మందితో కలిసి బేరాలు ఆడుతున్నాడు వెంకట లక్ష్మీనారాయణ. అదే సమయానికి పెనమలూరు పెట్రోలింగ్ పోలీసులకు వారు కనపడ్డారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. వారి వద్ద నుంచి పులి చర్మంగా కనిపించే కుక్క చర్మాన్ని, గోర్లను, దంతాలను స్వాధీనం చేసుకున్నారు. కుక్క చర్మానికి పెయింటింగ్ వేశారు. గోర్లు, దంతాలను ఆవు గిట్టల నుంచి తీసినట్లుగా అటవీ అధికారుల నివేదికలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి ప్లాన్ ను చూసిన జనాలు మీ బుర్రలకు దండాలయ్య సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.