ప్రేమ.. ఏ క్షణాన ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో చెప్పడం చాలా కష్టం. అలా పుట్టిన ప్రేమను గెలిపించుకోవడానికి చాలా కష్ట పడుతుంటారు ప్రేమికులు. ఇక తమ ప్రేమను ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో అని భయంతో తమ నిండు ప్రాణాలను బలితీసుకుంటారు కొందరు ప్రేమికులు. తాజాగా తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అన్న అనుమానంతో తమ ప్రాణాలను తీసుకున్నారు ఓ ప్రేమ జంట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వారిద్దరూ స్వయానా బావామరదళ్లు కావడం. ఒకరినోకరు విడిచి ఉండలేక, తమ ప్రాణాలను కలిసి కట్టుగా తీసుకున్నారు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
విశాఖ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకులం జిల్లా చిన్నకొత్త పేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్ డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లా ఆముదాల వలస, బలగం గ్రామానికి చెందిన సంతోషి కుమారి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దామోదర్ అటు చదువుకుంటూనే.. నాన్నకి వ్యవసాయంలో సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే సంతోషికి దామోదర్ కు ఓ పెళ్లిలో పరిచయం ఏర్పడింది. అప్పుడే తెలిసింది వీరు వరసకు బావామరదళ్లు అవుతారని. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సెల్ ఫోన్స్ లో గంటలు గంటలు గా ప్రేమ కబుర్లు చెప్పుకునే వారు. అయితే వారి ప్రేమను తమ పెద్దలు ఎక్కడ అంగీకరించరో అన్న భయంతో.. గొల్లపాలెంలోని లాడ్జ్ లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
లాడ్జీ గదిలోకి సోమవారం వెళ్లిన వీరు మంగళవారం మధ్యహ్నం కూడా బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు తలుపులు పగలకొట్టి చూడగా.. దామోదర్, సంతోషిలు ఊరేసుకుని వెలాడుతూ.. కనిపించారు. మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే సంతోషి మెడలో మంగళ సూత్రం ఉండటం గమనార్హం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వారి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియదు. తెలిస్తే మేం ఒప్పుకునే వాళ్లం అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాకు చెప్పకుండా ఇలా ఆత్మహత్య చేసుకున్నారని వారు వాపోతున్నారు.