ప్రయాణికుల పట్ల మంచితనంతో మెలగాల్సిన ఓ కండక్టర్ రెచ్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించాడు. మతిస్థిమితం లేని ఓ యువకుడిపై కాళ్లతో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగకుండా బాధితుడిపై పరుష పదజాలంతో తిడుతు దూషించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ మారుతున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా రంగంపేటకు చెందిన దేవదాసు అనే మతిస్థితిమితం లేని యువకుడు వరంగల్ నుంచి తన స్వగ్రామం అయిన చండ్రగొండకు వెళ్లేందుకు వరంగల్ లో బస్సు ఎక్కాడు.
ఇక బస్సు ఎక్కిన అనంతరం దేవదాసు టికెట్ కోసమని ముందుగా కండక్టర్ కు డబ్బులు ఇచ్చాడు. అయితే డబ్బులు తీసుకున్న కండక్టర్ ఎంతసేపు అయినా దేవదాసుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఖంగారుపడ్డ ఆ యువకుడ వెంటనే టికెట్ ఇవ్వాలంటూ కండక్టర్ ను అడిగాడు. ఇలా అడగడంతో ఆ కండక్టర్ యువకుడిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. కోపంతో ఊగిపోయిన కండక్టర్ ఆ యువకుడిని కాలితో తన్ని అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఇదంత గమనిస్తున్న తోటి ప్రయాణికులు ఫొటోలు, వీడియోలు తీశారు.
అనంతరం కండక్టర్ పై కోపంతో ఊగిపోయి.. టికెట్ అడిగినా పాపానికి ఇలా దౌర్జన్యంతో అమాయకుడిని ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తావా అంటూ నిలదీశారు. టికెట్ డబ్బులు తీసుకుని పైగా టికెట్ ఇవ్వకపోగా, దౌర్జన్యంగా మతిస్థిమితం లేని యువకుడిపై దాడికి పాల్పడ్డ ఈ కండక్టర్ పై ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ మతిస్థిమితంలేని ఆ యువకుడిపై జరిగిన దాడిని బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ తీవ్రంగా ఖండించారు. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన వరంగల్ ఆర్టీసీలో సంచలనంగా మారింది.