తెలంగాణలోని ఓ జిల్లాలో ఎవరూ ఊహించని దారుణం వెలుగు చూసింది. జింక మాంసం పేరుతో కొందరు వ్యక్తులు కుక్క మాంసాన్ని విక్రయించారు. నిజంగానే జింక మాంసం అనుకుని చాలా మంది వండుకుని తిన్నారు.
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించారు. ఈ విషయం తెలియక ఎంతో మంది లొట్టలేసుకుని తిన్నారు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధితులు నెత్తి, నోరు బాదుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది? తిన్న వారి పరిస్థితి ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా చమన్ పల్లి గ్రామానికి చెందిన వరుణ్, పొట్టపెళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీళ్లిద్దరూ ఇటీవల లక్ష్మణచందా పట్టణానికి వెళ్లారు. ఓ ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్కును ఎవరికి అనుమానం రాకుండా దొంగిలించారు. ఆ తర్వాత ఆ కుక్కను ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం ఆ కుక్క మంసాన్ని జింక మాంసం అంటూ కొన్ని గ్రామాల్లోని ప్రజలకు అమ్మారు. ఇది నిజంగా జింక మాంసం అనుకుని ఎంతో మంది కొని వండుకుని తిన్నారు. ఇదిలా ఉంటే, లక్ష్మణచందా పట్టణానికి ఆనంద్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న కుక్కు ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది.
దీంతో అతడు కుక్క ఆచూకి కోసం కాలనీ అంతటా వెతికాడు. కానీ, ఎక్కడా కూడా ఆ కుక్క జాడ కనిపించలేదు. ఇక చేసేదేం లేక స్థానికంగా ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా కొందరు వ్యక్తులు ఆ కుక్కను దొంగిలించినట్లుగా ఆనంద్ గుర్తించాడు. వెంటనే అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఆ కుక్కను దొంగిలించి హత్య చేసి జింక మాంసం పేరుతో స్థానిక ప్రజలకు అమ్మామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుక్క మాంసం తినన బాధితులు నెత్తి, నోరు బాదుకుని వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.