Nellore: నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో కూతుళ్లపై తండ్రి క్షుద్ర పూజల ఘటనలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి చేతిలో గాయపడ్డ చిన్నారి పునర్విక కన్నుమూసింది. బుధవారం గాయాలతో చెన్నై ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మరణించింది. కాగా, బుధవారం నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణు తన ఇద్దరు కవల కూతుళ్లపై క్షుద్ర పూజలు నిర్వహించాడు. పూర్విక, పునర్విక(4)లను ఇంట్లో కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. చిన్న పాప పునర్విక నోట్లో కుంకుమ పోసి గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరినీ తండ్రి బారినుంచి రక్షించారు.
ఇదే అదునుగా భావించిన వేణు అక్కడినుంచి పారిపోయాడు. అయితే, పునర్విక పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వేణును పట్టుకుని విచారిస్తున్నారు. పెళ్లైన 12 ఏళ్లకు పుట్టిన పిల్లల్ని క్షుద్ర పూజల పేరిట తండ్రి బలిచేయాలనుకోవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Magician: ఆ మెజీషియన్ పర్ఫార్మెన్స్‌కు అందరూ చప్పట్లు కొట్టారు.. కానీ, పోలీసులు అరెస్ట్ చేశారు.