తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నవీన్ హత్య కేసులో హరి గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు హసన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వారిని జైలుకు తరలించింది. ఆవివరాలు..
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ ప్రియురాలిని, అతడికి సహకరించిన మరో స్నేహితుడు హసన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం హయత్‌నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో హసన్‌ను ఏ2గా, యువతిని ఏ3లుగా చేర్చారు. హయత్ నగర్ న్యాయస్థానం వీరిద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో యువతిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలానే మరో నిందితుడు హసన్‌ను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు పోలీసులు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన హరిహరకృష్ణ, మృతుడు నవీన్ ఇద్దరు ఇంటర్ నుంచి స్నేహితులు. యువతి కూడా ఇంటర్‌లో వీరి క్లాస్‌మెట్. ఆ సమయంలో నవీన్, యువతి మధ్య కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడించింది. తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత యువతి హరిహరకృష్ణకు దగ్గరైంది. అయితే కొంత కాలంగా నవీన్ మళ్లీ యువతికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో అతడిపై కోపం పెంచుకున్న హరి కొన్ని నెలల ముందస్తు ప్లాన్ ప్రకారమే నవీన్‌ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. రెండు నెలల క్రితమే కత్తి కొనుగోలు చేసి.. తన స్కూటీలో పెట్టుకుని తిరుగుతున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
జనవరి 17న గెట్ టూ గేదర్ అని పిలిచి.. నవీన్‌ను బండి మీద తీసుకెళ్లి.. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శరీర భాగాలను వేరు చేసి వాటితో సెల్ఫీలు కూడా దిగాడు. హత్య చేసిన తర్వాత స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి.. దుస్తులు మార్చుకున్నాడు. తర్వాత హత్య గురించి ప్రియురాలికి చెప్పాడు. తను నమ్మకపోవడంతో.. ఆమెను తీసుకుని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత హసన్ సాయంతో నవీన్ డ్రెస్ మార్చి.. అతడి శరీర భాగాలను కాల్చి వేశాడు. యువతి దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుని.. వరంగల్ వెళ్లిపోయాడు. తండ్రికి దారుణం గురించి చెప్పడంతో.. అతడు పోలీసులకు లొంగి పోవాల్సిందిగా సూచించాడు. ఆ తర్వాతే నవీన్ హైదరాబాద్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ఇంత దారుణానికి ఒడి గట్టిన హరి, అతడి స్నేహితురాలి ప్రవర్తన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.