ఇతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. చివరికి ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇటీవల ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కూతురిని ప్రేమించిన యువకుడిని బెదిరించారు. మా అమ్మాయిని మర్చిపో.. లేకుంటే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపానికి గురైన ఆ యువకుడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది.
పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ప్రసన్నకుమార్ (24). నంద్యాల జిల్లా దోర్నపాడు మండలం చాకరాజువేముల గ్రామంలో నివాసం ఉండేవాడు. అయితే గతంలో ప్రసన్నకుమార్ కు కడప జిల్లా జమ్మలమడుగు గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయం అయింది. దీంతో ఇద్దరు ఒకరికొకరు నచ్చుకోవడంతో కొంత కాలంగా ప్రేమించుకున్నారు. దీంతో ఇద్దరూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ క్రమంలోనే ఆ యువతి ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. కోపంతో ఊగిపోయిన ఆ అమ్మాయి తండ్రి తన కూతురిని ప్రేమించిన వాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా.. మా అమ్మాయిన మర్చిపో.. లేకుంటే చంపేస్తా మంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఆ మాటలు విన్న ప్రసన్న కుమార్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు అనుకుని బాధపడ్డాడు. ఇందులో భాగంగానే ప్రసన్న కుమార్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రులు వెంటనే ప్రసన్న కుమార్ ను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. చేతికందిన కొడుకు ఉన్నపళంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.