MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కాకినాడ జిల్లా సాయుధ దళం క్వార్టర్స్‌లో ఉంచారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అనంత బాబును విచారిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుబ్రమణ్యం ఎమ్మెల్సీతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో సుబ్రమణ్యం యాక్సిడెంట్‌కు గురయ్యాడంటూ అతడి సోదరుడికి అనంత బాబు సమాచారం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తన కారులోనే సుబ్రమణ్యం మృతదేహాన్ని కాకినాడకు తీసుకువచ్చి, అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. శవాన్ని బయటకు తీయాలంటూ అతడి కుటుంబసభ్యుల్ని అనంత బాబు అరిచారు.
వారు ఏమైందని అడగ్గా సమాధానం చెప్పకుండా వేరే కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి తమ కుమారుడ్ని ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేశాడని సుబ్రమణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దాన్ని హత్య కేసుగా మార్చారు. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం మృతదేహానికి శనివారం పోస్టుమార్టం పూర్తయింది. అతడిది హత్యేనని తేలింది. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న అనంత బాబును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం కోసమే అరెస్ట్ ఆలస్యం అయిందని తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Disha Case: ‘దిశ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో మాకూ అంతే జరిగింది’