భార్యా భర్తల మధ్య గొడవలు జరగటం సర్వ సాధారణం.. చాలా మంది ఆలుమగలు తరచుగా ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉంటారు. అయితే, ఈ గొడవలు హద్దుల్లో ఉండాలి. లేకపోతే దారుణాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. అది కూడా డంబెల్‌తో ఆమెను కొట్టి చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని హాయసళ నగర్‌కు చెందిన మోరిస్, లిడియా భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది.
ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. మోరిస్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లిడియా ఇంటి దగ్గరే ఉండి సంసారాన్ని నడిపిస్తోంది. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. రోజురోజుకు ఈ గొడవలు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం పిల్లలు స్కూలుకు పోయిన తర్వాత భార్యాభర్తలు గొడవపడ్డారు. గొడవ సందర్భంగా మోరిస్ పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంట్లో గొడవ జరుగుతోందని, భార్యతో గొడవపడుతున్నాని వారితో చెప్పాడు. దీంతో పోలీసులు గొడవ ఆపటానికి మోరిస్ ఇంటికి హుటాహటిన వెళ్లారు.
అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులు మోరిస్ ఇంటికి వెళ్లే సరికి లిడియా రక్తపు మడుగుల్లో పడి ఉంది. ఆమె తల కూడా నుజ్జునుజ్జయింది. పోలీసులు మోరిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షణిక ఆవేశంలో తానే భార్యను హత్య చేసినట్లు మోరిస్ ఒప్పుకున్నాడు. డంబెల్‌తో కొట్టి భార్యను చంపినట్లు వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.