Vijayawada: ఓ వ్యాపారి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు యాసిడ్ తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన కోసూరు చైతన్య విజయవాడ లయోలా కాలేజ్‌లో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కేసరపల్లిలో అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 14న ఎనికేపాడులోని స్నేహితుల గదికి వచ్చాడు. అక్కడ ఓ షాపునకు వెళ్లి నీళ్ల బాటిల్ కావాలన్నాడు. ఫ్రిజ్‌లో ఉంది తీసుకోమని ఆ వ్యాపారి చెప్పాడు. చైతన్య ఫ్రిజ్లో నీళ్ల బాటిల్ పక్కన ఉన్న యాసిడ్ సీసాను తీసుకున్నాడు. అది అచ్చం మంచి నీళ్ల బాటిల్‌లా ఉండటంతో గబగబా తాగేశాడు.
ఆ వెంటనే వాంతులు చేసుకోవటం మొదలుపెట్టాడు. స్నేహితులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చైతన్య యాసిడ్ తాగినట్లు ధ్రువీకరించారు. మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వెంటనే విజయవాడ సూర్యారావుపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయం తప్పినా లోపలి అవయవాలు కొద్దిగా పాడైనట్లు తేలింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స జరుగుతోంది. లయోలా కాలేజీ యజమాన్యం ఆసుపత్రి ఖర్చులు భరించటానికి ముందుకు వచ్చింది. చైతన్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భూమా అఖిల ప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.