పగలు, ప్రతీకారాలతో కొంత మంది దేనికైన తెగిస్తున్నారు. నా అనుకున్న వాళ్లను శత్రువులు హత్య చేస్తే పగోడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్ని ఎత్తులైన వేస్తున్నారు. అచ్చం ఇలాగే 13 ఏళ్ల క్రితం తన తండ్రి హత్యకు కారణమైన వాడిని కొడుకు రూ.30 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించి తన పగ తీర్చుకున్నాడు. ఇటీవల మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కీసర మండలం దమ్మాయిగూడ పీఎస్ రావు నగర్ కు చెందిన జంగారెడ్డికి, కాప్రా మండలం చక్రీపురం సితారాంనగర్ కు చెందిన రఘుపతికి గత కొన్నేళ్ల నుంచి భూతగాదాలు నడుస్తున్నాయి. అయితే ఇదే విషయమై అనేక సార్లు రఘుపతి, జంగారెడ్డి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో పెద్దల పంచాయితిలో పెట్టి వీరి సమస్యను పరిష్కరించుకుందామని అనుకున్నారు. అయితే పంచాయితిలో భాగంగా జంగారెడ్డి రఘుపతిని అందరి ముందు తిట్టాడు. దీనిని అవమానంగా భావించిన రఘుపతి ఎలాగైన జంగారెడ్డిని హత్య చేయాలనే ప్లాన్ వేశాడు.
కాగా 2009లో కొంతమందితో చేతులు కలిపిన రఘుపతి జంగారెడ్డిని దారుణంగా హత్య చేయించాడు. తండ్రి హత్యకు కారణమైన రఘుపతిపై జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ఎప్పటికైన ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే పగతో రగిలిపోతున్న శ్రీకాంత్ రెడ్డి క్షణం క్షణం రఘుపతి చావు గురించి ఆలోచించేవాడు. అలా 13 ఏళ్లు గడిచింది. తండ్రిని చంపిన రఘుపతిపై శ్రీకాంత్ రెడ్డికి కోపం మాత్రం చల్లారలేదు. ఇందులో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి గత మూడు నెలల నుంచి రఘుపతి హత్యకు ఓ ప్లాన్ గీశాడు.
ఇది కూడా చదవండి: నాన్న.. గోదావరిలో దూకి చనిపోతున్నా! కన్నీరు పెట్టిస్తున్న యువకుడి ఆత్మహత్య!
తన తండ్రి జంగారెడ్డి స్నేహితుడు మంజునాథ్ కర్ణాటకలో వ్యాపారం చేస్తున్నాడు. అతనిని కలిసి ఈ విషయం గురించి పూర్తిగా వివరించాడు. దీంతో మంజునాథ్ శ్రీకాంత్ రెడ్డికి రిజ్వాన్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. రఘుపతిని హత్య చేసేందుకు రిజ్వాన్ రూ.30 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఇందులో భాగంగానే రిజ్వాన్ ఈ నెల 15న రఘుపతిని అనుసరించి రోజంతా అతని గురించే కాపు కాశాడు. దీంతో అదే రోజు రాత్రి రఘుపతి తన స్నేహితులతో కలిసి ఓ వైన్ షాప్ ఉండడం రిజ్వాన్ గమనించాడు. వెంటనే రిజ్వాన్ గ్యాంగు వేటకొడవళ్లు, కత్తులతో రఘుపతిని దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే వీరిని కలుసుకున్న జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రూ.30 లక్షలు వారి చేతికందించాడు. ఈ ఘటనపై స్పందించిన రఘుపతి భార్య శ్రీకాంత్ రెడ్డి అతని స్నేహితులపై ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాంత్ రెడ్డి, రాజేష్ లతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.